ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు? లీటరుపై రూ. 25 బాదుడు.. అదే జరిగితే..!

Wait 5 sec.

: వాహనదారులకు అతి త్వరలోనే భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. హార్ముజ్ జలసంధి మూసివేతతో.. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని స్థిరంగానే ఉంచినప్పటికీ.. పెరుగుతున్న రిఫైనరీ నష్టాల నేపథ్యంలో పెంచక తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఆఖరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. ఆ వెంటనే రాత్రికి రాత్రే ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు ప్రముఖ దేశీయ బ్రోకరేజీ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ప్రస్తుత క్రూడాయిల్ ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపుపై లీటరుపై రూ. 25 నుంచి రూ. 28 వరకు ఉండొచ్చని కోటక్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. అదే జరిగితే వాహనదారుల జేబుకు చిల్లు పడనుందని చెప్పొచ్చు. దాదాపు నాలుగేళ్లుగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకుండా స్థిరంగానే ఉంచుతున్నాయి. మధ్యలో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు లీటరుపై రూ. 2 చొప్పున తగ్గించింది కానీ ఎప్పుడూ పెంచలేదు. దీంతో నాలుగేళ్ల తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇటీవల క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువనే ఉండగా.. ఇది ఒక దశలో మళ్లీ 120 డాలర్ల స్థాయికి పెరిగింది. అంతకుముందు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ముడి చమురు ధర 100 డాలర్లపైనే చాలా కాలం కొనసాగింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం.. ఈ 3 సంస్థలు కలిసి రోజుకు రూ. 2400 కోట్ల మేర నష్టాల్ని భరించినట్లు తెలిసింది. చమురు విషయంలో భారత్ సుమారు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో క్రూడాయిల్ ధరలు పెరిగితే.. ఆయిల్ కంపెనీలకు అదే స్థాయిలో భారం పడుతుంటుంది. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని (SAED) భారీగా తగ్గించగా.. కాస్త భారం తగ్గింది. అయినప్పటికీ రోజుకు రూ. 1600 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. . దీంతో.. పశ్చిమాసియాలో యుద్ధం ఇలానే కొనసాగితే, రిఫైనరీలు ఇంకా నష్టాల్ని భరించలేవని.. ఈ క్రమంలోనే ధరల పెంపు తథ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర ధరలు పెద్దగా మారవు. వీటిని స్థిరంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాయి. అందుకే.. ఏప్రిల్ 29న ఎన్నికలు ముగిశాక.. ధరలు పెంచొచ్చని భావిస్తున్నారు.