తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ముందు అత్తా కోడలు ఇంట్లో అనుమానాస్పద రీతిలో విగతజీవులుగా కనిపించారు. ఆ తర్వాత కొడుకు ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెంకు చెందిన మోహన్ భార్య హరిత, తల్లి చంద్రకళ, ఇద్దరు పిల్లలు కౌశిక్, హరిణితో నివాసం ఉంటున్నాడు. మోహన్ నారాయణవనంలో సిమెంటు షాపు ఉంది.. హరిత టైలరింగ్ షాప్ నడుపుతోంది. కొద్దిరోజులుగా హరిత సోదరుడు బాలకృష్ణ కూడా బావ మోహన్‌తో కలిసి సిమెంట్ షాపులో ఉంటున్నాడు. మోహన్ బుధవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. అలా భోజనం కోసం ఇంటికి వెళ్లిన మోహన్ తిరిగి షాపు దగ్గరకు రాకపోవడంతో బాలకృష్ణకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంంటికి వెళ్లి చూడగా.. మోహన్ తల్లి చంద్రకళ, భార్య హరిత విగతజీవులుగా పడి ఉన్నారు. బాలకృష్ణ స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మోహన్ తల్లి చంద్రకళ, భార్య హరితను హత్యచేసి పిల్లలతో పారిపోయి ఉంటాడని అందరూ అనుమానించారు. మోహన్ కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో మోహన్ పుత్తూరు దగ్గర రైలు పట్టాలపై పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చింది.మోహన్‌ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారని ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది ఇంట్లో హరిత, చంద్రకళలు విగత జీవులుగా పడి ఉండటంతో.. మోహన్ ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హరిత, చంద్రకళది హత్యా?.. వారిని ఎవరు చంపారు?.. ఒకవేళ మోహనే చంపితే కారణాలేమిటి? మోహన్ పిల్లలతో కలసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మరణాలకు కారణాలు అంతుబట్టడం లేదని బంధువులు, స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.