Tata Stock: భారతదేశంలోని అన్ని ప్రముఖ కంపెనీలు 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికం ఫలితాల్ని (Q4 Results) ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలానే ముందుగా ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫలితాల సీజన్‌ను మొదలుపెట్టింది. తర్వాత ఇతర ఐటీ కంపెనీలు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కూడా ఫలితాల్ని ప్రకటించేశాయి. ఇప్పుడు ఇతర సంస్థలు అదే చేస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రిటైల్ అవుట్‌లెట్స్ నిర్వహిస్తున్న ట్రెంట్ కూడా క్యూ4 ఫలితాల్ని వెల్లడించింది. బుధవారం మార్కెట్ అవర్స్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. జుడియో, వెస్ట్‌సైడ్ వంటి అవుట్‌లెట్స్‌ను ట్రెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ట్రెంట్‌కు ఆఖరి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 413.10 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం 32.57 శాతం పెరిగింది. అప్పుడు రూ. 311.60 కోట్లుగా లాభం వచ్చింది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం కూడా 19.23 శాతం మేర ఎగబాకి రూ. 5027.99 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయంతో కలుపుకొని చూస్తే మొత్తం ఆదాయం రూ. 5055.90 కోట్లుగా ఉంది. ఇక సంస్థ వ్యయాలు కూడా 16.7 శాతం పెరిగి రూ. 4520.95 కోట్లుగా నమోదయ్యాయి. బోనస్ షేర్లు..క్యూ4 ఫలితాల సమయంలోనే బోర్డు మరో కీలక ప్రకటన చేసింది. కంపెనీ షేర్ హోల్డర్లకు 1:2 రేషియోలో బోనస్ షేర్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ షేర్ హోల్డర్స్ దగ్గర ఉండే ప్రతి 2 షేర్లకు అదనంగా ఒక షేరు వచ్చి చేరుతుంది. ఉదాహరణకు 100 షేర్లు ఉన్నవారికి మరో 50 షేర్లు వస్తాయి. ఇదే విధంగా 200 షేర్లు ఉంటే.. మరో 100 షేర్లు వస్తాయి. దీనికి రికార్డ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. సంస్థకు ప్రస్తుతం 5 లక్షల మంది వరకు షేర్ హోల్డర్లు ఉన్నారు. వీరికి బోనస్ ఇష్యూ గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండానే అదనంగా షేర్లు వచ్చి చేరతాయి. అయితే దానికి తగ్గట్లుగా షేర్ ధర అడ్జస్ట్ అవుతుంది. ట్రెంట్ 600 శాతం డివిడెండ్..బోనస్ ప్రకటనతో పాటుగా ట్రెంట్ మరో శుభవార్త కూడా చెప్పింది. షేర్ హోల్డర్లకు డివిడెండ్ ప్రకటించింది. రూ. 1 ముఖ విలువ ఉన్న ప్రతి షేరుకు రూ. 6 చొప్పున డివిడెండ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది దాదాపు 600 శాతంగా చెప్పొచ్చు. ట్రెంట్ షేర్లు..ట్రెంట్ స్టాక్ విషయానికి వస్తే గత కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. . గత నెల కాలంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఏప్రిల్ 22న ఫలితాల నేపథ్యంలో స్వల్పంగా పెరిగి రూ. 4,409.90 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 1.58 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 6,261 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 3,275.50 గా ఉంది. గత నెలలో మాత్రం 31 శాతం పుంజుకుంది.