ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మాడు పగలగొడుతున్నాయి.. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఉష్ణొగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఎండల తీవ్రత కనిపించింది.. ముందు 35 డిగ్రీల నుంచి మొదలై 40 డిగ్రీల వరకు చేరింది. మార్చి నెల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.. 42 డిగ్రీల నుంచి 45 వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతులు 45 డిగ్రీలు కూడా దాటి 46 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా 19 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 21 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాల్లో.. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వేడిగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8 డిగ్రీలు, అమరావతిలో 44.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా బెస్తపల్లిలో 44.2 డిగ్రీలు, కడప జిల్లా వీరబల్లిలో 44.2 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఏపీలో ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత ప్రభావం కనిపిస్తోంది.. జనాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.