తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ ఎన్నో ట్రస్టుల్ని నిర్వహిస్తోంది.. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఎంతోమందికి సేవలు అందిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో బధిర విద్యార్థుల కోసం ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విద్యా సంస్థల్లో చదువు, వసతి పూర్తిగా ఉచితం.. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యాల శిక్షణను ఉచితంగా అందిస్తారు. ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది టీటీడీ.. అర్హులైన వారు జూన్ 01 2026 వరకు దరఖాస్తులను పూర్తి చేసి అందజేయాలని సూచించారు.తిరుపతి, భీమవరం, వరంగల్‌లో ఈ విద్యాసంస్థలు ఉన్నాయి.. వీటిలో అడ్మిషన్లు కావాల్సిన బధిర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలక్షన్ కమిటీ ద్వారా విద్యా్ర్థులకు అడ్మిషన్లు కేటాయిస్తారు. ప్రతి ఏడాది 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పి్స్తారు.. మిగిలిన తరగతుల్లో ఖాళీల మేరకు ప్రవేశాలు ఉంటాయి. తిరుపతిలోని బధిరుల విద్యా సంస్థలో 1వ తరగతి చేరాలనుకునేవారికి, 2వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు తిరుపతి కళాశాల, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల్ని తిరుపతి ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల నుండి నేరుగా పొందవచ్చు, వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఇంఛార్జ్ ప్రిన్సిపాల్, ఎస్వీడిఎఫ్, అలిపిరి, తిరుపతి – 517501 చిరునామాకు పంపాలి.తిరుపతి అలిపిరి సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల బధిర విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. జులై 25 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో అప్పట్లో టీటీడీ ఛైర్మన్ అన్నారావు ప్రారంభించారు. దశలవారీగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శ్రీ వేంకటేశ్వర బధిరోన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌లో HEC, CEC గ్రూప్లతో శ్రీ వేంకటేశ్వర బధిరుల జూనియర్ కాలేజీని 2008 నుంచి టీటీడీ నిర్వహిస్తోంది. విద్యతో పాటు డ్రాయింగ్, టైలరింగ్, బుక్ బైండింగ్ , యోగ లాంటి నైపుణ్య వృత్తులలో శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 231 మంది బధిర విద్యార్థిని, విద్యార్థులు, ఎస్వీ బధిరుల జూనియర్ కాలేజీలో 162 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1985 ఏడాది నుంచి.. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో 1987 ఏడాది నుంచి బధిర విద్యార్థుల కోసం పాఠశాలలను ప్రారంభించారు. ప్రస్తుతం భీమవరంలో 80 మంది, వరంగల్ లో 166 మంది బధిర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. టీటీడీ ప్రతి ఏడాది బధిర విద్యార్థిని విద్యార్థుల పురోగతి కోసం సుమారు రూ.3.50 కోట్లు పైచిలుకు ఖర్చు చేస్తోంది. ఏడాదికోసారి తిరుపతి, తిరుమల ఆలయాలకు తీసుకెళ్తారు. టీటీడీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల కాలేజీలో విద్యను అభ్యసించిన విద్యార్థిని, విద్యార్థులు టీటీడీలో పలు విభాగాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ద్వారా బధిర విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, వైద్య సంరక్షణ, సంకేత భాష ఆధారిత బోధన, నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా పద్ధతులు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థులను స్వావలంబన దిశగా తీర్చిదిద్దుతూ సమాజంలో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.