: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం వేతనాల పెంపుపై కసరత్తు మొదలు పెట్టింది. వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉద్యోగులు సంఘాలు, అసోసియేషన్లతో చర్చలు జరిపేందుకు పే కమిషన్ సిద్ధమైంది. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించే సమావేశాలపై కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశాలకు సంబంధించి పే కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్లో ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.'ఏప్రిల్ 28-30 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే సమావేశాల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి. సమయాభావం వల్ల వచ్చిన అన్ని అభ్యర్థనలను అంగీకరించడం కుదరకపోవచ్చు. కానీ గరిష్ఠ సంఖ్యలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.' అని 8వ వేతన సంఘం తన ప్రకటనలో పేర్కొంది. అలాగే కేవలం ఈ చర్చలు ఢిల్లీకే పరిమితం కాకుండా రాబోయే కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలూ చేపడతామని, అందుకోసం రాష్ట్రాల్లో పర్యటిస్తామని వెల్లడించింది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ఢిల్లీకి రాలేని ఉద్యోగ సంఘాల ప్రతినిధిలు తమ ప్రాంతాల్లోనే కమిషన్‌ను కలిసి తమ సమస్యలను, వినతులను వివరించే అవకాశం ఉంటుందని తెలిపింది. 'ఢిల్లీ ఎన్‌సీఆర్ వెలుపల ఉన్న ఆసక్తి గల స్టేక్ హోల్డర్స్, కిమిషన్ మీ రాష్ట్రానికి లేదా సమీప రాష్ట్రానికి వచ్చినప్పుడు అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు' అని సూచించింది. తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు పే కమిషన్‌ను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. . 7వ వేతన సంఘం గడువు 2025, డిసెంబర్‌తో ముగిసింది. ఈ క్రమంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. 18 నెలల్లోగా ఈ తన నివేదికను సమర్పించేందుకు గడువు ఇచ్చారు. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సుల పెంపు ఆధారపడి ఉండనుంది. తాజా సమావేశాల ప్రకటనతో వేతన పెంపు ప్రక్రియలో కదలిక రావడంపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సమావేశాల షెడ్యూల్, పర్యటనల వివరాలను కమిషన్ ఎప్పటికప్పుడు తన అధికారిక వెబ్‌సైట్లో అప్డేట్ చేయనుంది. కాబట్టి ఉద్యోగ సంఘాలు నిరంతరం వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.