అనుమానాస్పద కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన విషాదకర ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో వెలుగులోకి వచ్చింది. పైధోనీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భర్త (40), భార్య (35), వారి ఇద్దరు కుమార్తెలు (16, 13 ఏళ్లు) ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించారని పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఏప్రిల్ 25వ తేదీ శనివారం రాత్రి జరిగింది. ఆ రోజు రాత్రి సుమారు 10.30 గంటలకు బంధువుల సహా మొత్తం తొమ్మిది మంది కుటుంబసభ్యులు కలిసి డిన్నర్ చేశారు. ఆ తర్వాత బంధువులు వారి వారి ఇళ్లకు తిరిగి వెళ్లారు. అదే రోజు తెల్లవారుజామున 1.00 - 1.30 గంటల మధ్య ఆ నలుగురూ పుచ్చకాయ తిన్నట్లు సమాచారం.ఆదివారం తెల్లవారుజామున సుమారు 5:30 నుంచి 6:00 గంటల మధ్య భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. తొలుత ఫ్యామిలీ డాక్టర్‌ వారికి చికిత్స అందించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జేజే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రులో వైద్యం అందించినప్పటికీ వారి చిన్న కుమార్తె ఉదయం 10.15 గంటలకు మరణించగా, భర్త అదే రోజు రాత్రి 10.30 గంటలకు మరణించారు. చికిత్స పొందుతూ భార్య, పెద్ద కుమార్తె కూడా కన్నుమూశారు.ప్రమాదవశాత్తూ అనుమానాస్పద మృతి కేసు నమోదుకావడంతో.. నలుగురికీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. కానీ, హిస్టోపాథలాజికల్ నివేదికలు అందిన తర్వాతే మరణానికి గల తుది కారణం నిర్ధారణ కానుంది. బాధితులను అబ్దుల్లా డొకాడియా (40), నస్రీన్ డొకాడియా (35), వారి కుమార్తెలు ఐషా (16), జైనాబ్ (13)గా గుర్తించారు. ఆ రాత్రి పుచ్చకాయ తినడానికి ముందు బిర్యానీ తిన్నారని పోలీసులకు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ అనుమానిత ఫుడ్ పాయిజనింగ్‌కు గల కచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగా ఉందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, ఝార్ఖండ్‌ గిరిధ్ జిల్లాలో ఆదివారం ఇటువంటి సంఘటనే జరిగింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధి బజ్తో గ్రామంలో రోడ్డుపక్కన పానీపూరీ, చాట్ తిన్న తర్వాత ఓ ఏడేళ్ల చిన్నారి చనిపోగా.. మరో 18 మంది అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఇది విరేచనాలు, వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఆహార పరిశుభ్రత, భద్రత విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు తరుచూ కోరుతూనే ఉన్నారు.