2009లో చంద్రబాబుతో అందుకే పొత్తు పెట్టుకున్నాం.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wait 5 sec.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‍లో నిర్వహించిన రజతోత్సవ సంబురాల ముగింపు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూనే.. తెలంగాణ ఉద్యమం, అందులో టీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి.. ఆ సమయంలో తనను ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురి చేసినట్లు కేసీఆర్ గుర్తు చేసుకుని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణను వేరు చేయడానికి.. హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గాలంటూ సోనియాగాంధీ తనకు 16 సార్లు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరగా తేలిపోతుందని సోనియా గాంధీ తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. కానీ తాను మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదని, వారి బెదిరింపులు, బుజ్జగింపులకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‍తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అప్పట్లోనే తాము గట్టిగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించినట్లు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇక 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సమయంలో.. టీడీపీతో, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సందర్భంగాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. అది ఎందుకు జరిగిందో వివరించారు. నారా చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అని అనిపించేందుకే.. అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో చిల్లర, చండాలమైన ప్రభుత్వం నడుస్తోందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎవరూ మాట్లాడలేదంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆ సమయంలో లోక్‍సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ సూర్య ఒక పెద్ద వెధవ అంటూ మండిపడ్డారు. అతడు అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని ఆరోపించారు. తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవారని తేల్చి చెప్పారు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్‍ పార్టీకి ఉన్నంత చిత్తశుద్ధి ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిపోయిందని కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావటం లేదని అన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలు అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గేట్లు తీయలేదని విమర్శించారు.