తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేత, కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో లెజెండ్ అవుతారని ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కేటీఆర్, కవితలు.. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలపై.. ఎమ్మెల్యే తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. జాతీయ స్థాయిలో లెజెండ్ అవుతారని తెలిపారు. దాన్ని ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే లెజెండ్‍గా మారబోతున్నారని ఎమ్మెల్యే సామేల్ జోస్యం చెప్పారు. తాజాగా సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యహరించబోతున్నారని.. ఎవరు తలకాయ బాదుకున్నా దాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు. రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ కేటీఆర్ చెబుతున్నారని.. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి డేగకన్ను వేశారని పేర్కొన్న ఎమ్మెల్యే మందుల సామేల్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇప్పుడు ఉన్న సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.ఈ క్రమంలోనే కవిత అంశాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కేటీఆర్‍కు రేగు కంప లాగా ఆయన సోదరి కవిత తగిలిందని.. కవిత రూపంలో కేటీఆర్‍కు చిక్కులు ప్రారంభం అయినట్లు హేళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు.. కవిత పార్టీ ఎందుకు పెట్టిందో తెలంగాణ ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు ఏం చేశారని కవిత ప్రశ్నిస్తోందని.. ముందు వాటికి సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏం చేయకపోతే తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో కవిత చెప్పాలని అడిగారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లిని కాదని.. కేసీఆర్ కవితకు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో చెప్పాలని ఎమ్మెల్యే సామేల్ డిమాండ్ చేశారు. ఇంటి పొరుతో ఇబ్బంది పడుతున్న కేటీఆర్.. మంది జోలికి ఎందుకు పోతున్నారు అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తుపట్టట్లేదని కేటీఆర్ అంటున్నారని.. కానీ కేటీఆర్‍ను గుర్తుపట్టే ప్రాంతాలు తనకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. గుంట నక్కలు, తోడేళ్లు అంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని కదిలించే దమ్ము ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు.