వైఎస్ జగన్ ఇంటికెళ్లి ఒంటిమిట్ట అర్చకుల వేదాశీర్వచనం.. టీటీడీ ఆగ్రహం, షోకాజ్ నోటీసులు జారీ

Wait 5 sec.

కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ అర్చకులకు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు షాక్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఇంటికి వెళ్లిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.. ఆయనకు వేదాశీర్వచనాలు అందించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతు తీసుకోకుండా.. నిబంధనలను అతిక్రమించి రాజకీయ నేతలను కలిసినందుకు గానూ ఈ నోటీసులు జారీ అయ్యాయి.ఒంటిమిట్ట ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న ఎ. శ్రావణ్‌కుమార్, కె. పార్థసారథి, వీణా మనోజ్‌కుమార్ ఇటీవల పులివెందులకు వెళ్లారు. ఆ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే శేష వస్త్రంతోపాటు.. రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను కూడా అర్చకులు వైఎస్ జగన్‌కు అందించారు.నిబంధనల ప్రకారం టీటీడీ, దాని పరిధిలో ఉన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులు, సిబ్బంది.. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే తప్పనిసరిగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అర్చకులు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. పులివెందులకు వెళ్లడం, అక్కడ వేదాశీర్వచనం ఇవ్వడంపై టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.ఈ ముగ్గురు అర్చకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంటిమిట్ట ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఎ. ప్రశాంతి.. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రొటోకాల్ పాటించకుండా.. అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ఆలయ మర్యాదలు ఎలా చేస్తారని ఆగ్రహించారు. ఈ నోటీసులకు సంబంధించి 2 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని.. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అర్చకులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలు పాటించడం, ఆలయ పవిత్రతను కాపాడటంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని టీటీడీ అధికారులు హెచ్చరించారు.