తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల దశాబ్దాల కాలపు నిరీక్షణ త్వరలో ముగియనుంది. దాదాపు పాతికేళ్లు వేచి చూడాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఒక ప్రత్యేక కార్యచరణను రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన నివేదిక ఆమోదం పొందితే.. వేలాది మంది కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల జీవితాల్లో ప్రమోషన్ల రూపంలో కొత్త వెలుగులు నిండనున్నాయి.తెలంగాణలో పోలీస్ స్టేషన్ల కేటగిరీల ఆధారంగా ఉన్న సిబ్బంది విభజన వల్ల పదోన్నతులు దక్కటం లేదు. ప్రస్తుతం ఒక ఏఎస్సై కింద 13 మంది కానిస్టేబుళ్లు ఉండటంతో.. పైస్థాయికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ హెడ్‌కానిస్టేబుల్ కావడానికి 16 నుంచి 27 ఏళ్లు, అక్కడి నుంచి ఏఎస్సై కావడానికి మరో 7 నుంచి 11 ఏళ్లు పడుతోంది. ఈ జాప్యం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నిస్తేజం నెలకొంటున్నాయి.ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి కొత్తగా సగటు నిష్పత్తి విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇకపై ప్రతి ఏఎస్సై/ఏఆర్‌ఎస్సైకి ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉండేలా మార్పులు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కేడర్ల మధ్య సమతుల్యత ఏర్పడి, పదోన్నతులు సకాలంలో వస్తాయి. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే మొత్తం 15,582 మందికి పదోన్నతులు దక్కుతాయి. 8,560 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా, 7,022 హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా ప్రమోషన్ లభిస్తుంది. మొత్తం పోలీస్ కానిస్టేబుళ్ల సంఖ్య 81,555 గానే ఉన్నప్పటికీ.. పై కేడర్లలో పోస్టుల సంఖ్య పెరగడం వల్ల ఈ మార్పు సాధ్యమవుతుంది. దీని ఫలితంగా ఏర్పడే 15,582 కానిస్టేబుల్ ఖాళీలను ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ పదోన్నతుల ప్రక్రియ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 71.3 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, పోలీసుల సంక్షేమం, పనితీరు దృష్ట్యా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకొని ప్రమోషన్లు కల్పించనున్నట్లు తెలిసింది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఇక తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ రానున్నారు. నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీవీ ఆనంద్‌ను కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డీజీపీగా అర్హులైన ఐపీఎస్‌ల జాబితాను ఇటీవలే యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన విషయం విధితమే. ఈ జాబితాలో సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన సౌమ్య మిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. ఈ ముగ్గురిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నూతన డీజీపీగా నియమించింది. గంతంలో హైదరాబాద్ సీపీగా, ఏసీపీ డీజీగా, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ పనిచేశారు.