నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 8 జిల్లాల్లో రికార్డు స్థాయి ఎండలు, నిర్మల్‌లో 46 డిగ్రీలు

Wait 5 sec.

తెలంగాణలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 10 తర్వాత అయితే దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 28 ) రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు గత పదేళ్ల రికార్డులను బద్దలుకొట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఏడు జిల్లాల్లోని సుమారు 39 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 15 మండలాల్లో, నిర్మల్ జిల్లాలో 10 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఎండ తీవ్రత ప్రజలను అతలాకుతలం చేసింది.నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్ సాత్నాలలో 45.6 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి బాన్సువాడలో 45.5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వరుసగా కొన్ని రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఎండల తీవ్రతకు తట్టుకోలేక రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆటో డ్రైవర్ భూక్యా రవి (35), కుమురంభీం జిల్లా వాంకిడిలో మత్స్యకారుడు చిచోల్కర్ రాందాస్ (44), వికారాబాద్ జిల్లా కండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీ కొత్త అనసూజ (41) వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు. ఇక రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు, రేపు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. మే 1 నుంచి 3 వరకు దక్షిణ, తూర్పు తెలంగాణలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని.. 44-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. మే 4-8 వరకు హైదరాబాద్‌తో సహా తెలంగాణలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు, వడగాలులు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో పగటిపూట అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు ఎండ నుంచి రక్షణ పొందేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.