తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణం ప్రస్తుతం కేంద్ర జనగణన పోర్టల్‌లో కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్భాగమైన భద్రాచలం.. ఆన్‌లైన్ స్వీయగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియలో మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో లేదని సాఫ్ట్‌వేర్ సందేశం చూపిస్తోంది. దీంతో తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పట్టణ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఎంపిక చేసుకునే క్రమంలో జియో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు.. 'జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది' అనే సందేశం వస్తోంది. అంటే.. భద్రాచలం పట్టణాన్ని ఈ పోర్టల్ తెలంగాణ సరిహద్దుల వెలుపల ఏపీలో ఉన్నట్లు గుర్తిస్తోంది. దీనికి ప్రధాన కారణం గూగుల్ మ్యాప్స్‌లో కూడా భద్రాచలం పట్టణం ప్రస్తుతం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లుగా చూపిస్తుండటమేనని తెలుస్తోంది. భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ.. మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌లలో నెలకొన్న ఈ పొరపాటు ప్రస్తుతం ఆన్‌లైన్ నమోదుకు అడ్డంకిగా మారింది.ఈ సమస్యపై భద్రాచలం ఎమ్మార్వో వెంకటేశ్వర్లు స్పందించారు. ఈ సాంకేతిక లోపాన్ని ఇప్పటికే జనాభా లెక్కల విభాగానికి చెందిన సాంకేతిక బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. సరిహద్దుల గుర్తింపులో తలెత్తిన ఈ పొరపాటును సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమై స్థానికులు వివరాలు నమోదు చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు. కాగా, రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసినప్పటికీ, భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలోనే ఉండిపోయింది. అయితే ఇప్పుడు సాంకేతిక కారణాల వల్ల అది ఏపీలో ఉన్నట్లు చూపిస్తుండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ లోపాన్ని సరిదిద్ది జనగణనలో భద్రాచలం పట్టణ గుర్తింపును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామాల (పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు, ఏటపాక) విలీన వివాదం నడుస్తోంది. విభజన సమయంలో పోలవరం ముంపు సాకుతో ఏపీలో కలిపిన ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇటీవల తెలంగాణ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ.. పాలనా సౌలభ్యం కోసం ఈ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గతంలో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ భూములు కూడా ఈ గ్రామాల్లోనే ఉండటం, స్థానిక గిరిజనులు తెలంగాణలో చేరాలని తీర్మానాలు చేస్తుండటంతో ఈ అంశంపై కేంద్రం నిర్ణయం కోసం ఇరు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో భద్రచాలం ఏపీలో ఉన్నట్లు గూగుల్‌లో మ్యాప్‌లో కనిపించటం పట్ల స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు.