పెట్రోల్‌, డీజిల్‌‌పై ఫిర్యాదులు ఉన్నాయా.. ఈ నంబర్‌కు కాల్ చేసి చెప్పండి.. మంత్రి ఉత్తమ్

Wait 5 sec.

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. పెట్రోల్, డీజిల్ దొరకదు అని.. ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో.. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు.. పెట్రోల్ బంకుల మందు బారులు తీరుతున్నారు. చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపించడంతో.. వాహనదారుల్లో భయం మరింత పెరిగిపోతోంది. అయితే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. ప్రభుత్వం, అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇంకో రకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్‌కు అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందని.. దీని ప్రభావం ఖమ్మం, మిర్యాలగూడ, నిర్మల్ వంటి సరిహద్దు జిల్లాలపై పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. పుకార్ల కారణంగనే ప్రజలు కావాల్సిన దాని కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఇవాళ జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికల పోలింగ్ తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలు, వదంతులతో ఈ పరిస్థితి మరింత తీవ్రం అయినట్లు చెప్పారు. రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు. 24 గంటలు పనిచేయాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను కోరినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 3,817 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు కలెక్టర్లతో జిల్లా ఇంధన సరఫరా కమిటీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలను పర్యవేక్షించేందుకు అధికారులను రెడీగా ఉంచినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ అవుట్‌లెట్ల నుంచి ప్రతీ 4 గంటలకు ఒకసారి తాజా సమాచారాన్ని తీసుకుంటూ డిమాండ్‌కు సరిపడా నిల్వలను ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత.. బ్లాక్ మార్కెట్‌లకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తేల్చి చెప్పారు.మరోవైపు.. రాష్ట్రంలో చమురు సరఫరాపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ప్రతినిధులతో హైదరాబాద్ సోమాజిగూడ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంధన కొరత తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటోందని వివరించారు. సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యే దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడానికైనా కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని తెలిపారు.