పశ్చిమ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని బీజేపీ ఆరోపించడంతో డైమండ్ హార్బర్‌లోని ఫల్తాలో కొన్ని బూత్‌లలో ఓటింగ్‌ను నిలిపివేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది టీఎంసీకి కంచుకోట. ఫల్తాలో ఉన్న పలు పోలింగ్ బూత్‌లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లపై తమ బటన్‌ను టేప్ చేశారని బీజేపీ ఆరోపించింది.ఈ ఆరోపణను ఖండించిన టీఎంసీ.. బెంగాల్‌లో ఓడిపోతున్నందుకే బీజేపీ తప్పుడు ఆరోపణలు సృష్టిస్తోందని పేర్కొంది. తమ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌ను బెదిరించారని సింగంగా గుర్తింపు పొందిన ఐపీఎస్ అధికారి పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మపై, అలాగే ఎన్నికల కమిషన్‌పై కూడా ఆ పార్టీ విమర్శలు చేసింది. ట్యాంపరింగ్ జరిగినట్టు నివేదికలు వస్తే, వాటిని ధ్రువీకరించి, నిజమని తేలితే ఆ బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఫల్తాలో ప్రభావితమైన అన్ని బూత్‌లలోనూ రీపోలింగ్ చేపట్టాలని బీజేపీ మీడియా ఇంఛార్జి అమిత్ మాలవీయా డిమాండ్ చేశారు. ‘‘అనేక పోలింగ్ బూత్‌లలో, బీజేపీకి ఓటు వేసే ఆప్షన్‌ను టేపుతో చుట్టేశారు.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా సమర్థవంతంగా నిరోధించారు. దీనినే 'డైమండ్ హార్బర్ మోడల్' అని పిలుస్తున్నారు. ఈ మోడల్‌తోనేనా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా గెలిచారు’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఫల్తాలోని హరిందంగా హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన బూత్‌కు సంబంధించిన వీడియోలను మాలవీయా షేర్ చేయగా.. ఈవీఎంలో బీజేపీ గుర్తు పక్కన ఉన్న బటన్‌పై టేపు అంటించి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే పద్ధతిలో మరో బూత్‌తో పాటు మరికొన్ని బూత్‌లను కూడా తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.అయితే, ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రిజు దుత్తా మాట్లాడుతూ.. ఆన్‌లైన్ పోస్ట్‌లు పెట్టే బదులు అమిత్ మాలవీయా తన బాస్‌లకు ఈ విషయం చేరవేసి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి అని కౌంటర్ ఇచ్చారు.