రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. రూ.1,000 కోట్లు విడుదల

Wait 5 sec.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి.. రిటైర్ అయిన వారికి ఇచ్చే డబ్బులు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమ బకాయిలను విడుదల చేయాలంటూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పటికే ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పేరుకుపోయిన జీపీఎఫ్ బకాయిలను మొత్తం క్లియర్ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్థిక శాఖ ఇవాళ రూ.1,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది.రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను తాజాగా ప్రభుత్వం క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న అన్ని బకాయిలను ఒకేసారి రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ చేసిన వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందుల నేపథ్యంలో విడుదలకు మోక్షం లభించింది. దీంతో ఆ నిధులు ఇప్పుడు నేరుగా రిటైర్డ్ ఉద్యోగుల వారి అకౌంట్లలో జమ కానున్నాయి.మరోవైపు.. ఇప్పటివరకు పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయడంతో పాటు.. భవిష్యత్తులో కూడా జీపీఎఫ్ నిధుల చెల్లింపులను మరింత వేగంగా రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రతీ నెలా చేసే చెల్లింపుల పరిమితిని మరో రూ.వెయ్యి కోట్లకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సంబంధించిన క్లెయిమ్‌లు, బిల్లులు ఇక నుంచి బకాయిల రూపంలో పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే.. సీఎం రేవంత్ రెడ్డి.. ఉద్యోగుల సంక్షేమం పట్ల కూడా దృష్టి పెట్టడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాం వచ్చిందని పేర్కొన్నారు.ఇక.. రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి జరుగుతున్న జాప్యంపై ఇటీవలె తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.6,200 కోట్ల బకాయిలను చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే నిర్ణయించింది.ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు చెల్లించే జీతాల్లో 50 శాతం కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఆ కోత విధించిన సొమ్మను.. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వెంటనే రెవెన్యూ రిసోర్సెస్‌ మొబిలైజేషన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను రిలీజ్ చేయడం గమనార్హం.