Petrol Price Today: దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ఊహాగానాలు, వార్తలు వస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరల పెంపు ప్రతిపాదనేదీ తమ దగ్గర లేదని.. ప్రస్తుతానికి ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ధరల పెంపు ఉంటుందంటూ వస్తున్న వార్తలు.. దురుద్దేశపూరితమైనవని.. తప్పుదోవ పట్టించేవని.. ప్రజల్లో భయాందోళనల్ని సృష్టించేందుకు ఉద్దేశించినవి అని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో (x) పోస్ట్ చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇప్పట్లో ఉండదని ఒక క్లారిటీ వచ్చింది. ఇదే సమయంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. వాస్తవానికి.. గత నాలుగేళ్లలో ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచని ఏకైక దేశం కూడా భారత్ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఈ పెరుగుదల నుంచి ప్రజల్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం, ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించింది. . చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం విధించింది. ఇటీవల అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా.. యుద్ధం ముగింపుపై స్పష్టత లేదు. కొద్ది రోజుల కిందట పాకిస్థాన్ వేదికగా జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు రెండో విడత చర్చలు ఎప్పుడు జరుగుతాయన్నది క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువగానే ఉండగా.. యుద్ధం సమయంలో ఒక దశలో 120 డాలర్లకు కూడా చేరింది. ప్రస్తుతం 100 డాలర్లపైనే ఉంది. అయినప్పటికీ దేశీయంగా మాత్రం చమురు కంపెనీలు నష్టాల్ని భరిస్తున్నాయి. 3 ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు రూ. 1600 కోట్లకుపైగా నష్టపోతున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఏ సమయంలో అయినా లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 25-28 నుంచి పెరుగుతాయని వార్తలు వచ్చాయి. . ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తే హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ. 95.70 వద్ద ఉంది. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే.. హైదరాబాద్‌లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి.