ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడానికి నేనే కారణం.. వాజ్‌పేయి చెప్పేదాకా తెలియలేదు: లక్ష్మీపార్వతి

Wait 5 sec.

నందమూరి తారక రామారావు.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన నేత. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన పేరు గుర్తుంటుంది. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే సీఎం పగ్గాలు చేపట్టిన ఆయన.. కేంద్రంలోనూ చక్రం తిప్పారు. 1988లో చొరవతోనే కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమికి ఎన్టీఆర్ చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఎన్టీఆర్ తలుచుకుంటే ప్రధాని అయ్యేవారని.. కానీ ఆయన రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. బీజేపీ దిగ్గజ నేతలైన అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ లాంటి నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. 1984 లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.తెలుగు జాతికి, భారతదేశానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయమై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పదే పదే కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రధానులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎన్టీఆర్‌కు మాత్రం రావడం లేదు. దీనికి కారణమేంటనే విషయాన్ని ఎన్టీఆర్ సతీమణి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం కోసం తాను ఎంతో ప్రయత్నించానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఢిల్లీ వెళ్లి ఎందరో ప్రధానులు, రాష్ట్రపతులను కలిశానన్నారు. ఎన్టీఆర్ భార్య హోదాలో తాను భారతరత్న తీసుకుంటాననే కారణంతోనే ఆయనకు అవార్డు రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌తో తీర్మానం చేస్తుందని.. తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేస్తుందని లక్ష్మీపార్వతి ఆరోపించారు.‘‘దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు వెళ్లి కలిస్తే.. తప్పకుండా చేద్దామమ్మా.. చాలా చిన్న విషయమే కదా అని చెప్పారు. కానీ ఎందుకు ఆగిపోయిందో తెలీలేదు. తర్వాత ప్రధాని అయిన గుజ్రాల్‌ను కలిస్తే.. ఎన్టీఆర్ నాకు చాలా మంచి మిత్రులు.. తప్పకుండా చేద్దామని మాటిచ్చారు. తర్వాత వాజ్‌పేయి గారిని అడిగాను. ఆయన ఓపెన్‌గా సత్యం చెప్పారు. అప్పటి వరకూ నేను పిచ్చిగా అందర్నీ కలిశాను. రాష్ట్రపతులు, పార్లమెంట్ సభ్యులను అందర్నీ కలిశాను. మీ తండ్రి కోసం కృషి చేయండి అని అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణను కూడా కోరాను. ఎన్టీఆర్‌‌కు భారతరత్న ఇవ్వాలని కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతి నారాయణన్ గారికి ఇచ్చాను. వాజ్‌పేయి మాత్రం నిజం చెప్పారు. నువ్వెంత ప్రయత్నించినా ఎన్టీఆర్‌కు భారత రత్న రాదు. దానికి కారణం నువ్వే. ఎన్టీఆర్‌కు ఇచ్చే భారతరత్నను మీ చేతుల మీదుగా అందుకోవడం ఆ ఫ్యామిలీకి ఇష్టం లేదు, అందుకే రాదని చెప్పారు’’ అని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.