తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు ఎక్కడికక్కడ డిపోల ముందు బైఠాయించి.. బస్సులను బయటికి రానీయకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు.. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక సిబ్బంది నడుపుతున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో.. కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తాము వెనక్కి తగ్గబోమని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెబుతుండగా.. చర్చలకు రావాలని, ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దని ప్రభుత్వం కోరుతోంది.ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్న తెలంగాణ మంత్రి వర్గం.. సమావేశం తర్వాత దీనిపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో సుదీర్ఘంగా భేటీ అయి చర్చించారు. ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులతోపాటు.. వీరంతా కూలంకషంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.ఇక సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ కార్మికులతో ఇప్పటికే చర్చించిన ఐఏఎస్ కమిటీ.. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి వర్గంలో ఆర్టీసీ సమ్మెపై ఏం చర్చించి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. కేబినెట్ భేటీ తర్వాత ఈ నివేదిక ఆధారంగా.. రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ప్రధాన డిమాండ్లు అయిన వేతన సవరణ, పెండింగ్ బకాయిలు, ఇతర సంక్షేమ పథకాలపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.