శ్రీవారి భక్తుల కోసం 16 మెడికల్ సెంటర్లు.. తిరుమలలోని ఈ ప్రాంతాల్లో ఉన్నాయి, ఉచితంగా వైద్యం

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. తిరుమలకు వచ్చే భ‌క్తుల ఆరోగ్య భ‌ద్రత‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ.. వారికి వైద్య స‌హాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిమిషాల్లో వైద్యం అందించేందుకు అవసరమైన వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 16 వైద్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొండపై అశ్వినీ ఆస్పత్రి ముఖ్యమైనది.. అలాగే అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్-6 ఎదురుగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ప‌క్కన‌ కూడా వైద్య కేంద్రాలు ఉన్నాయి. అలాగే తిరుమలలోని క‌ల్యాణ‌క‌ట్ట, ఏటీసీ స‌ర్కిల్, పీఏసీ-5, తిరుమల శ్రీ‌వారి ఆల‌యం దగ్గర కూడా ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నడిచి వచ్చే అలిపిరి న‌డ‌క మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, ర‌ద్దీ స‌మ‌యంలో నారాయ‌ణ‌గిరి షెడ్ల దగ్గర ఉన్న వైద్య కేంద్రాల్లో 24/7 భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు అందుబాటులో ఉన్నాయని టీటీడీ తెలిపింది.తిరుమలలోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్రసాద కేంద్రం, పీఏసీ-2లో వైద్య కేంద్రాలు ఉన్నాయి. అలంతేకాదు అలిపిరిలో ఉన్న పాదాల మండ‌పం, ఏడో మైలు, భాష్యకార్ల స‌న్నిధి, ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న రోజుల్లో శిలాతోర‌ణం, సేవా స‌ద‌న్ దగ్గర వైద్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉద‌యం 8 గంటల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు వైద్య సేవ‌లు అందుబాటులో ఉంటాయి. భక్తులు నడిచి వచ్చే శ్రీ‌వారి మెట్టులోని 1200 మెట్టు దగ్గర ఉద‌యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వైద్య సేవ‌లు అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల స‌మ‌యంలో రామ్ భ‌గీచా-1, పాప‌వినాశ‌నం దగ్గర అదనంగా రెండు వైద్య కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటుగా మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ల ద్వారా కూడా భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుమ‌ల‌లో మొత్తం 9 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు.. శ్రీవారి భ‌క్తుల‌కు అత్యవ‌స‌ర వైద్య సేవ‌లు అందిస్తాయి. టీటీడీ ఆధ్వర్యంలో 3 అంబులెన్సులు న‌డుస్తుండ‌గా.. మరో ఐదు 108 అంబులెన్సులు ఉన్నాయి.. ఇంకొకటి అపోలో అంబులెన్సు కూడా ఉంది. వీటిలో అశ్విని ఆస్పత్రి దగ్గర 2 అంబులెన్సులు, ఒక అపోలో అంబులెన్సు అందుబాటులో ఉంటుంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వైద్య కేంద్రం దగ్గర ఒక అంబులెన్సు ఉంటుంది. అలాగే తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న రామ్ భ‌గీచా విశ్రాంతి గృహం దగ్గర ఒక అంబులెన్సు సిద్ధంగా ఉంటుంది. ఏటీసీ దగ్గర ఒక అంబులెన్సు, అలిపిరి చెకింగ్ సెంటర్, తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని లింకు రోడ్డు, మొద‌టి ఘాట్ రోడ్డులోని 35వ మ‌ల‌పు దగ్గర ఒక్కో అంబులెన్సు ఉంటుంది. అత్యవ‌స‌ర‌మైన వైద్య స‌హాయం అవ‌స‌ర‌మైన భ‌క్తుల‌ను ముందుగా అశ్విని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తారు. మెరుగైన వైద్యం అవ‌ర‌మైన వారిని ఉచితంగా తిరుప‌తిలోని రూయా, బ‌ర్డ్‌, స్విమ్స్, ప్రభుత్వ మెట‌ర్నటీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తారు. అంతేకాదు బ్రహ్మోత్సవాలు, ర‌థ స‌ప్తమి వేడుక‌ల స‌మ‌యంలో వాహ‌న సేవ‌ల వెనుక ఒక అంబులెన్సు, నారాయ‌ణగిరి షెడ్ల దగ్గర మరో అంబులెన్సును అద‌నంగా అందుబాటులో ఉంచుతారు.తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు 8 మంది డాక్టర్లు, 120 మంది పారా మెడిక‌ల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వీరు నిరంత‌రాయంగా వైద్య సేవ‌లు అందిస్తుంటారు. తిరుమ‌ల‌లోని అన్ని వైద్య కేంద్రాల్లో రోజుకు స‌గుటున 2400 మంది భ‌క్తులు వైద్య సేవ‌లు పొందుతున్నారు. ఇలా తిరుమ‌ల‌కు వ‌చ్చిన భ‌క్తుల‌కు అన్ని ర‌కాల వైద్య సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో ఉన్న అశ్విని ఆస్పత్రిలో ఈసీజీ, ఎక్స్-రే, ల్యాబ్, నెబ్యూలేష‌న్, ఆక్సీజ‌న్, డ్రెస్సింగ్ వంటి వివిధ వైద్య స‌దుపాయాల‌తో పాటు మెరుగైన వైద్యం అవ‌స‌ర‌మైన వారిని తిరుప‌తిలోని రూయా, బ‌ర్డ్‌, స్విమ్స్, ప్రభుత్వ మెట‌ర్నటీ ఆస్పత్రులకు తరలిస్తారు. ఈ వైద్య కేంద్రాల్లో వైద్యం ఉచితం.మరోవైపు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాన్ని టీటీడీ ప్రారంభించింది. ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆలయ సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రథమ చికిత్స కేంద్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు. ఈ కేంద్రం ద్వారా భక్తులకు తిరుచానూరులో పనిచేసే సిబ్బందికి తక్షణ వైద్య సేవలు, ఫస్ట్ ఎయిడ్, సాధారణ చికిత్సలు అందిస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి, అవసరమైతే ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించే ముందు రోగులను స్థిరపరిచే సేవలు అందించనుంది.