రిటైర్డ్ ఉద్యోగుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల త్యాగం.. బకాయిల చెల్లింపు కోసం జీతాల్లో 50 శాతం కోత

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లుగా పేరుకుపోయిన రూ.6,200 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను రాబోయే 100 రోజుల్లో చెల్లించాలని 2014 తర్వాత కాలంలో పదవీ విరమణ పొందిన పెండింగ్‌లో పడటంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాల్లో 50 శాతం నిలుపుదల చేసి ఆ నిధులను రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు. బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, నిధుల సమీకరణకు గానూ ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ రిసోర్సెస్‌ మొబిలైజేషన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఈ కమిటీ శుక్రవారం నుంచే తన పనిని ప్రారంభించనుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల సంఘాలతో చర్చించి పక్కా ప్రణాళికను సిద్ధం చేయనుంది.ఇక గురువారం నాటి కేబినెట్ భేటీ అనంతరం.. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014కు ముందు ఉద్యోగులు రిటైర్ అయిన నెల రోజుల్లోనే ప్రయోజనాలు అందేవని కేసీఆర్ హయాంలో వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని నేడు ఉన్న రూ.6,200 కోట్ల భారాన్ని బాధ్యతగా తాము స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. పదవీ విరమణ వయోపరిమితి పెంచడంతోపాటు.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోవడంతో.. రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. వచ్చే నెల 4వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం జరగనుందని... ఆ రోజున బకాయిల చెల్లింపు షెడ్యూల్‌పై పూర్తి స్థాయి స్పష్టత రానున్నట్లు చెప్పారు. ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకే నిధులు జమ చేసేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉందని.. అయినా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.