వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రాజీనామాను శాసమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. రాజీనామా విషయంలో వెంకటరమణ సమాధానం సంతృప్తికరంగా లేదంటూ ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జయమంగళ వెంకటరమణ 2023 మార్చిలో వైఎస్సార్‌‌సీపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 నవంబర్‌లో వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అలాగే తన రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని ఏకంగా మండలి సమావేశాల్లోనే ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్ తన రాజీనామాను ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని . ఆ తర్వాత ఈ పిటిషన్ విషయంలో శాసనమండలి ఛైర్మన్ కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయకపోవడంతో ఆయనకు రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే నాలుగు వారాల్లో వెంకటరమణ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది సెప్టెంబరులో హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాలను శాసనమండలి ఛైర్మన్ సవాల్ చేయగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ విచారణ జరిపింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ కేసు విచారణ జరగ్గా.. మూడు వారాల్లో ఎమ్మెల్సీ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని శాసనమండలి ఛైర్మన్‌ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. గురువారం రోజు వెంకటరమణ రాజీనామాను తిరస్కరిస్తూ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవితో పాటుగా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.మాత్రమే కాదు మరికొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనమా చేశారు. వీరిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లు ఉన్నారు. ఈ నలుగురు కూడా తన రాజీనామాలను ఆమోదించాలని శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు. వీరిని వేర్వేరుగా పిలిచిన ఛైర్మన్ విచారణ చేశారు.. వారు కూడా తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని, ఆమోదించాలని కోరారు.. కానీ వీరి రాజీనామాలపై ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నలుగురు ఎమ్మెల్సీలతో పాటుగా శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పదవీ కాలం జులైలో ముగుస్తుండటంతో ఈ ఏడాది మార్చిలో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు.