కేసీఆర్‌ను కవిత అలా అనడం బాధించింది.. కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్

Wait 5 sec.

కల్వకుంట్ల కవిత కొత్తగా పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని పట్టుకుని.. పార్టీ ఆవిర్భావ సభలోనే కవిత చేసిన విమర్శలు సరికావని రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత నూతన పార్టీ ఏర్పాటుపై స్పందించిన కోమటిరెడ్డి.. ఆమెపై విమర్శలు గుప్పించారు. అసలు కవిత ఒక కొత్త పార్టీని పెట్టడమే హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నిక చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. వారికి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ కారుడి కుమార్తెగా తనకు ఉన్న బాధ్యతను కవిత గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. తన మొట్టమొదటి సమావేశంలోనే తండ్రిని విమర్శించడం ద్వారా కవిత సమాజంలో తనకు ఉన్న మర్యాదను కోల్పోయారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన కేసీఆర్‌పై కవిత విమర్శలు చేయడం వ్యక్తిగతంగా తనకు బాధ కలిగించిందని వెల్లడించారు. కన్న తండ్రికి గౌరవం ఇవ్వని కవిత.. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలా ఆదర్శంగా నిలుస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న విభేదాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా క్లారిటీ రాలేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ ఢిల్లీ మద్యం కేసు ఇంకా పూర్తిగా ముగియలేదని గుర్తు చేశారు. డబ్బులు బాగా ఉన్నాయి కదా అని కొత్త పార్టీ పెట్టడం వల్ల.. నాయకత్వం రావడం అంత సులభం ఏమీ కాదని తెలిపారు. అదే సమయంలో కవిత తన కొత్త పార్టీ పేరును టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) గా నామకరణం చేయడం కూడా ఒక జోక్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇక కవిత.. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. తన కన్న తండ్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడం ద్వారా కవిత తన ప్రతిష్టను తానే దిగజార్చుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు ఎలాంటి పదవి ఇచ్చినా.. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధాల కారణంగా రాష్ట్రంలో, దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.