వరంగల్ NIT సరికొత్త ఆవిష్కరణ.. అన్ని రకాల పాత్రలకు సరిపోయే ఇండక్షన్ స్టవ్, త్వరలోనే మార్కెట్‌లోకి

Wait 5 sec.

వంటగదిలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంలో వరంగల్ నిట్ శాస్త్రవేత్తలు ఒక కీలక ఆవిష్కరణ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇండక్షన్ స్టవ్‌లు కేవలం ఫెర్రో మాగ్నెటిక్ అంటే ఇనుము ఆధారిత, స్టీల్ పాత్రలతోనే పనిచేస్తాయి. కానీ.. నిట్ పరిశోధకులు అభివృద్ధి చేసిన సరికొత్త ఇండక్షన్ స్టవ్.. మన ఇళ్లలో సర్వసాధారణంగా వాడే అల్యూమినియం, రాగి పాత్రలను కూడా వేడి చేయగలదు. ప్రొఫెసర్లు విశ్వనాథన్, పొర్పండి సెల్వి నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ వినూత్న వ్యవస్థను రూపొందించింది. స్టవ్‌లో అత్యాధునిక ఇన్వర్టర్ డిజైన్లు, ప్రత్యేక కంట్రోల్ టెక్నిక్స్‌ను ఉపయోగించినట్లు ప్రొఫెసర్ విశ్వనాథన్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న ఇండక్షన్ స్టవ్‌ల పరిమితులను ఈ ఆవిష్కరణ అధిగమించిందని చెప్పారు. వివిధ రకాల లోహాలతో తయారైన పాత్రలను సమర్థవంతంగా వేడి చేసేలా దీనిని డిజైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీని వల్ల గృహిణులు తమ పాత అల్యూమినియం పాత్రలను పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇండక్షన్ స్టవ్‌ను వాడుకోవచ్చునని చెప్పారు. ఈ ప్రయోగాత్మక నమూనా ఇప్పటికే లేబొరేటరీ స్థాయిలో విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇది కేవలం విద్యుత్ ఆదా చేయడమే కాకుండా.. చాలా కాంపాక్ట్‌గా, సురక్షితంగా ఉంటుందని ప్రొఫెసర్ పొర్పండి సెల్వి తెలిపారు. విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ టెక్నాలజీ సామాన్య ప్రజలకు, హాస్టల్ విద్యార్థులకు చిన్న చిన్న ఆహార వ్యాపారాలకు ఒక వరంగా మారనుందని అన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ ప్రత్యామ్నాయ ఇండక్షన్ స్టవ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వంట గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిశోధనలో భాగంగా నిట్ బృందం ఇప్పటికే రెండు పేటెంట్లను పొందింది. మరో పేటెంట్ పరిశీలనలో ఉంది. ఈ సాంకేతికతను మార్కెట్లోకి తీసుకురావడానికి రెసోహెలి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను కూడా నిట్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ప్రారంభించారు. దీనికి భారత ప్రభుత్వ ఐటీ శాఖ నుంచి సీడ్ ఫండింగ్ కూడా లభించింది. త్వరలోనే ఈ సరికొత్త ఇండక్షన్ స్టవ్‌లను సరసమైన ధరకే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రొఫెసర్లు వెల్లడించారు.