ఈజీ మనీ లక్ష్యంగా అమాయక యువతను ఆశజూపి వారి పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వందల కోట్లు కొల్లగొట్టిన ఘరానా ఉక్కుపాదం మోపారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన ఉడతనేని వికాస్‌ చౌదరి ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో నివసిస్తున్న ఈ కేటుగాడు.. తన భార్య బొప్పన నాగప్రియ, మరికొందరు సన్నిహితులతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు.ఈ ముఠాలో అడపా రామవెంకట చరణ్‌ చౌదరి, పోట్రు మనోజ్‌ కళ్యాణ్‌, మేడా భానుప్రియ, బొప్పన నాగప్రసాద్, మేడా సతీశ్‌కుమార్, పోట్రు ప్రవీణ్, జుంజునూరి శివకృష్ణ, జొన్నాదుల తిరుమలసాయి సభ్యులుగా ఉన్నారు. వీరంతా అంతర్జాతీయ సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపి.. సామాన్య ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. మ్యాట్రిమోని సైట్లు, రివార్డు పాయింట్ల ఆశ చూపడం, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు, షేర్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టో ట్రేడింగ్ పేరిట వేల మందిని నమ్మించి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. తమ ఖాతాలకు డబ్బులు తీసుకోకుండా చాలా తెలివిగా వ్యవహరించింది. సత్తుపల్లి ప్రాంతంలోని నిరుద్యోగులు, కూలీలు, గ్రామీణ యువతకు కొంత కమీషన్ ఇస్తామని ఆశ చూపి వారి పేరుతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలను తెరిపించారు. ఆ ఖాతాల ఏటీఎం కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. సైబర్ మోసాల ద్వారా వచ్చే సొమ్మును మొదట ఈ డమ్మీ ఖాతాల్లోకి మళ్లించి, ఆ తర్వాత తమ వ్యక్తిగత ఖాతాలకు, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చుకున్నారు. ఈ మార్గంలోఏకంగా రూ. 549.95 కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది.హైదరాబాద్ పోలీసులు ఈ భారీ లావాదేవీలను గుర్తించి ఈ ఏడాది జనవరిలో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపగా.. ప్రస్తుతం కొందరు బెయిలుపై బయట ఉన్నారు. అయితే వీరి నేర ప్రవృత్తిని అరికట్టేందుకు ఖమ్మం పోలీసులు పదిమంది నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరిచారు. వీరి ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా, నివాసాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచనున్నారు. నిందితుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లతో పాటు రాష్ట్ర స్థాయి పోలీస్ వెబ్‌సైట్లలో నిక్షిప్తం చేశారు. సస్పెక్ట్ షీట్ తెరిచిన నేపథ్యంలో వీరు ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ కొత్త వ్యాపారం ప్రారంభించినా పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో పాటు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. యువత ఇలాంటి మోసగాళ్ల వలలో పడి తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వొద్దని, అది తీవ్రమైన నేరమని సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల ద్వారా వచ్చే ప్రతి పైసాను ట్రాక్ చేస్తున్నామని ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.