పది పరీక్షల ఫలితాలు.. తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Wait 5 sec.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు వెల్లడి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షలు రాసిన వారే కాకుండా వారి తల్లిదండ్రుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవలె రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల తర్వాత పలువురు విద్యార్థులు.. ప్రాణాలు తీసుకోవడం, ఇళ్ల నుంచి పారిపోవడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు చేశారు. పిల్లల పేరెంట్స్, ఉపాధ్యాయులు.. వారికి ధైర్యం చెప్పి.. ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన సజ్జనార్.. "ఫలితం ఏదైనా విద్యార్థులను అక్కున చేర్చుకోండి.. మార్కులు మాత్రమే జీవితాన్ని శాసించలేవు. పదో తరగతి ప‌రీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నాదొక విన్నపం. ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించండి. ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది" అని పేర్కొన్నారు. "మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి... మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయకండి. ఫలితం ఏదైనా సరే, మీ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి" అని సజ్జనార్ సూచించారు."మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు మీకు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టండి. ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలి" అని సీపీ పేర్కొ్న్నారు."చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దు. పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించండి. ఏ చిన్న ఆందోళన కలిగినా మీ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సజ్జనార్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హితవు పలికారు.