అధికారం ఉందని ఇగో వద్దు.. పార్టీతో పాటుగా నేతలు నష్టపోతారని హితవు పలికారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు దేశం పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. ఫ్లెక్సీలు దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర చిన్నపాటి కలహాలు రాకూడదన్నారు. ఈ విషయంలో క్లియర్‌గా చెబుతున్నానని.. గతంలో ఇలాంటి ఘటనలు చూశానని.. అందుకే పదే, పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నన్ను బాధపెట్టాయన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నేతలపై ప్రజలు ఓ కన్నేసి ఉంచారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అన్నారు. నేతలు ఎవరిని కలుస్తున్నారో గమనిస్తున్నారని.. నేతలు, కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. చంద్రబాబు పరోక్షంగా ఇటీవల పిఠాపురంలో ఫ్లెక్సీలో ఫోటో విషయంలో జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు.. ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే కుర్చీల అంశాన్ని కూడా గుర్తించారు.. ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలకు అధికారులకు మధ్య జరిగిన కుర్చీల వివాదాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీలో కార్యకర్త నుంచి అధినేత వరకు క్రమశిక్షణతో పనిచేస్తారని.. క్రమశిక్షణ తెలుగు దేశం పార్టీ మూల సిద్ధాంతం అన్నారు చంద్రబాబు. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్నామని.. నేతలు, కార్యకర్తలు ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని.. ఒకవేళ ఎవరైనా తప్పుచేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రభుత్వంలో అధికార యంత్రాంగం, పార్టీ నేతలు, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డపేరు అందరికి వస్తుందని.. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూసి చాలా బాధపడ్డానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. కూటమిలో టీడీపీ ఉనికి కాపాడుకోవాలి.. ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలన్నారు. తాను, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మంచి రిలేషన్‌‌తో ముందుకు సాగుతున్నామని.. ఆ సంకేతాలు పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇస్తూనే ఉన్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది.. అందుకే మనం రాష్ట్రానికి, కేంద్రానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలన్నారు. కూటమిలో అందరూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తి గ్రామం వరకు కొనసాగాలన్నారు. 'నేను ఒక యజ్ఞం చేస్తుంటే.. అవతలివారు రాక్షసుల్లా దానిని భంగం చేయాలనుకుంటున్నారు.. మనవాళ్లు కూడా సరిగా ప్రవర్తించకపోతే మనకు నష్టం జరుగుతుంది. అన్ని ఉండి మనం ముందుకు సాగడం లేదు..నా రాజకీయ జీవితంలో మొట్ట మొదటిసారిగా పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాను.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ప్రజల మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 94శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఒక ఆలోచన రావాలి.. అందరూ క్రమశిక్షణతో ఉండాలి' అని చంద్రబాబు సూచించారు. 'తెలుగు దేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది.. ఒక్క ఓటమితో పార్టీలు కనుమరుగయ్యాయి.గెలిచినా, ఓడినా సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా మాత్రమే. 44 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలు, సవాళ్లను చూశాను.. కానీ ఎక్కడా ఎప్పుడూ పసుపు జెండా పౌరుషం తగ్గలేదు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో రావాలి. పార్టీలో కార్యకర్తే అధినేత.. ఆచరణలో కూడా చేసి చూపించాము. ఓ మండల పార్టీ అధ్యక్షురాలు, మరో క్లస్టర్‌ ఇన్‌ఛార్జిని పొలిట్‌బ్యూరో సభ్యులుగా చేశాము. గత 44 ఏళ్లుగా పార్టీ కమిటీలను నియమిస్తున్నాము.. సీనియర్లను గౌరవిస్తూనే కొత్తవారికి అవకాశం ఇస్తున్నాము. పార్టీ కోసం కష్టపడివారికి కమిటీలో అవకాశం ఇచ్చాము' అన్నారు.