: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి తొలగని వేళ.. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వరుసగా మూడో సెషన్‌లో కూడా తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతుండటం.. . ఇంకా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం అవుతుండటం.. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 24 సెషన్‌లో ఇంట్రాడేలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 1200 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 300 పాయింట్ల వరకు తగ్గింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 6 లక్షల కోట్లకుపైగా పడిపోయింది.>> ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం 2.50 గంటలకు సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఇలా అన్ని స్టాక్స్ 5 శాతానికిపైగా పడిపోయాయి. రిలయన్స్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా భారీగా తగ్గాయి.ఇదిలా ఉన్నప్పటికీ.. ఒక స్టాక్ మాత్రం ఇవాళ్టి సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్కెట్లు కుప్పకూలుతున్నా భారీగా ఎగబాకింది. అదే ఫార్మా రంగానికి చెందిన గుజరాత్ థెమిస్ బయోసిన్ లిమిటెడ్. కిందటి సెషన్‌లో ఈ స్టాక్ ధర రూ. 324.42 వద్ద ముగియగా.. ఇవాళ ఆరంభంలో స్వల్ప లాభాలతో మొదలైంది. తర్వాత ఎక్కడా తగ్గకుండా ఇంట్రాడేలో ఏకంగా 17 శాతం వరకు పెరిగి రూ. 380 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ గ్రూప్ సనోఫీ నుంచి క్షయ వ్యాధి నిరోధక, అంటువ్యాధుల నిరోధక బ్రాండ్ల శ్రేణిని కొనుగోలు చేసేందుకు.. గుజరాత్ థెమిస్ బయోసిన్ కంపెనీ సిద్ధమవుతుందని తెలిసింది. ఈ బ్రాండ్లకు యూరప్, మిడిల్ ఈస్ట్ సహా ఆఫ్రికాలోని 55 కిపైగా దేశాల్లో బలమైన మార్కెట్ ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 4 వేల కోట్లుగా ఉండగా.. ఇందులో సగం విలువకు డీల్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని తెలుస్తోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 479 కాగా.. కనిష్ఠ ధర రూ. 225.05 గా ఉంది. ఈ మేరకు గురువారం రోజు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. దీంతో ఒక్కసారిగా షేర్లు దూసుకెళ్లాయి.