ఐపీఎల్ మేనేజ్‌మెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ కొద్దిగంటలు టెన్షన్‌లో మునిగిపోయింది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుంది, ఎలాంటి న్యూస్ బయటకు వస్తుందోనని భయపడ్డారు. కానీ.. మొత్తానికి ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేకుండా గుడ్ న్యూస్ వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్లేయర్ క్షేమంగా బయటపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బౌలర్, సౌతాఫ్రికా ప్లేయర్ లుంగీ ఎంగిడిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి కింద పడిన ఎంగిడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఫిజియో వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చి చెక్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో వెంటనే అంబులెన్స్ తీసుకుని వచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. లుంగీ ఎంగిడి మెడ భాగంలో తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అదృష్టవశాత్తు పెద్ద సమస్య కాకపోవడంతో కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే డిశ్చార్జ్ అయ్యాడు. లుంగీ ఎంగిడి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్ దగ్గరుండి మరీ వైద్యులతో మాట్లాడి చికిత్స అందించాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే వివరాలు మాత్రం క్లారిటీ లేవు. స్లో యార్కర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ సీజన్‌లో ఢిల్లీ కీలక పేసర‌గా పేరు తెచ్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లుంగీ ఎంగిడీ 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ముంబై‌పై 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు, గుజరాత్‌పై 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ ఒక్క వికెట్ పడగొట్టలేదు. లుంగీ ఎంగిడీ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలయింది. బౌలింగ్ వైఫల్యంతో 264 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. లుంగీ ఎంగిడీ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయకపోవడంతో ఆ ప్రభావం ఢిల్లీ క్యాపిటల్స్ విజయం మీద పడింది.