తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న తొలి జనగణన-2027కు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన సెల్ఫ్-ఎన్యుమరేషన్ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుందని డైరెక్టర్ భారతీ హాళికెరి అధికారికంగా ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ గణన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు తమంతట తాముగా వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.ఈసారి జనగణన అనేక ప్రత్యేకతలకు వేదిక కానుందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేర్చటం విశేషం. అంతేకాకుండా.. ఇది పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న మొదటి జనగణన. ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యుమరేషన్ ద్వారా పౌరులు నేరుగా ప్రభుత్వ వెబ్ పోర్టల్ సందర్శించి తమ కుటుంబ వివరాలను అందించవచ్చు. అయితే, ఇది నిర్బంధం కాదని, కేవలం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కల్పించిన ఒక వెసులుబాటు మాత్రమేనని భారతీ హాళికెరి స్పష్టం చేశారు.జనగణన ప్రక్రియను రెండు ప్రధాన దశలుగా విభజించారు. మొదటి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి భవనాన్ని, ఇంటినీ గుర్తిస్తారు. ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, అద్దె ఇళ్లు, చివరికి గుడిసెలను కూడా వదలకుండా లెక్కిస్తామని డైరెక్టర్ పేర్కొన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి భవనానికి మార్కింగ్ చేస్తారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్లాకులను విభజించి, తగినంత మంది ఎన్యుమరేటర్లను కేటాయించడం జరిగింది. ఈ భవనాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. జన గణనలో అసలైన రెండో దశ ప్రారంభమవుతుంది.2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే రెండో దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఈ లోపు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అధికార యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ భౌగోళిక సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, డిజిటల్ డేటా సేకరణ ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ప్రక్రియలో ప్రజలు సహకరించి తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.