‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’: శ్రీవల్లికి కడుపూ లేదూ.. గిడుపూ లేదూ.. అదంతా భాగ్యం ఆడించిన డ్రామా.. హమ్మ దౌర్భాగ్యం!!

Wait 5 sec.

మొన్నటి వరకూ శ్రీవల్లి ఏం చేసినా కూడా.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే ఉండేది. కానీ.. ఇప్పుడు ఆమె నెల తప్పడంతో తన్తే బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. శ్రీవల్లి.. తన తల్లితో కలిసి చేసి వెధవ పనులన్నీ ఒక్క రామరాజుకి తప్ప ఇంట్లో వాళ్లందరికీ తెలిసిపోయింది. అమూల్య-విశ్వల మధ్య ప్రేమ రాయబారం నడిపి.. తన చెల్లెలు గొంతుకోయాలని చూడటమే కాకుండా.. ఆ నిందను ప్రేమపై మోపాలని చూసిందని తెలుసుకున్న చందు.. ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. భాగ్యం మోసం చేసి పెళ్లి చేసిందనీ.. అసలు వాళ్లకి ఆస్తులే లేవని.. శ్రీవల్లి ఎంఏ ఇంగ్లీష్ కూడా కట్టు కథ అని.. ప్రేమ, నర్మదల కాపురాల్లో చిచ్చు పెట్టడానికి అనేక కుట్రలు చేశారని.. ఇలా ఆ తల్లీ కూతుళ్లు చేసిన దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడటంతో శ్రీవల్లి పుట్టింటికే పరిమితం అయ్యింది. తప్పు చేశాను.. నన్ను క్షమించు అని చందు కాళ్లపై పడినా.. జీవితంలో మళ్లీ తప్పు చేయను.. నా కాపురాన్ని నిలబెట్టండి అని ప్రేమ, నర్మదల కాళ్లా వేళ్లా పడ్డాకూడా ఎవరూ కనికరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవల్లిని క్షమించేది లేదని తెగేసి చెప్పాడు చందు. ఇక శ్రీవల్లి కాపురం నిలబడటానికి అన్నిదారులూ మూసుకుని పోగా.. ఆమె కడుపులో పడ్డ బిడ్డే ఆమె జీవితాన్ని నిలబెట్టాడు. పుట్టింటికి పోయిన శ్రీవల్లి నెల తప్పడంతో.. తిరిగి ఆమెను మళ్లీ అత్తింటికి తీసుకుని వచ్చింది వేదవతి అత్త. భాగ్యం చెంప చెల్లుమనిపించి.. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి.. శ్రీవల్లిని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చింది వేదవతి. అయితే అంత జరిగినా కూడా వాళ్ల బుద్ధి మారలేదు. ఈ ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడు.. పెత్తనం అంతా పెద్ద కోడలిగా నీకే రాబోతుంది అంటూ కూతురుకి మళ్లీ నూరిపోస్తుంది భాగ్యం.అయితే ఇక్కడే కథని మలుపుతిప్పే ట్విస్ట్ ఉంది. శనివారం ఎపిసోడ్‌ చూస్తే.. అసలు శ్రీవల్లి నెలతప్పిందా? నిజంగానే ఆమె తల్లికాబోతుందా? అనే డౌటానుమానం రాకమానదు. శ్రీవల్లితో భాగ్యం మాట్లాడిన మాటలు చూస్తే.. ‘శకున్ని తలదన్నే నా చావు తెలివితేటల్ని బీభత్సంగా వాడేసి.. బాగా కష్టపడి నిన్ను మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెట్టేట్టు చేశాను’ అని అంటుంది భాగ్యం. ఆ మాటతో శ్రీవల్లి.. ‘నీ బుర్ర తుర్రుమని తన్నేసిందా ఏంటీ.. నా కడుపులో పడ్డ బిడ్డ కదా నన్ను మళ్లీ మా అత్తారింట్లో అడుగుపెట్టేలా చేసిందీ’ అని అంటుంది. అప్పుడు భాగ్యం నాలుకు కరుచుకుని సైలెంట్ అయిపోతుంది. అయితే ఈ సైలెంట్‌లో వైలెంట్ కనిపిస్తుంది. ఏం చేసినా కూడా.. శ్రీవల్లిని అత్తారింట్లో అడుగుపెట్టనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి.. అందుకే భాగ్యం ఈ కడుపు అస్త్రాన్ని వదిలిందా? అంటే అదే నిజం కావచ్చు. అయినా ఎన్ని సీరియల్స్‌లో చూడలేదూ.. ఈ ఫేక్ ప్రెగ్నెన్సీలు. డాక్టర్‌ని మ్యానేజింగ్ చేసేసి.. శ్రీవల్లి నెల తప్పిందని చెప్పి అత్తారింట్లో అడుగుపెట్టేట్టు చేసుండొచ్చు భాగ్యం. ఎందుకంటే ఆమె ఎన్ని కుట్రలు చేసినా కూడా బెడిసికొట్టాయి. తన కూతురు కాపురం నిలబెట్టడంపోయి.. ఇంకా ఇంకా పడగొట్టింది ఈమె చావు తెలివితేటలతో. కాబట్టి.. శ్రీవల్లి అత్తింటి వాళ్లు హారతి పట్టి ఆహ్వానించాలంటే.. ఆమె ముందు ఉన్న ఒకే ఒక్కదారి శ్రీవల్లి నెల తప్పడం. చివరికి అదే చేసి ఉండొచ్చు.సరే.. ప్రస్తుతానికి మ్యానేజింగ్ చేసిందనే అనుకుందాం.. మరి ఆ తరువాత ఈ కడుపు డ్రామాని ఎలా రక్తి కట్టిస్తుంది? అందర్నీ ఎలా నమ్మిస్తుంది అంటే.. సీరియల్స్‌లో కడుపు రావడానికి ఎన్ని తిప్పలు పడతారో.. కడుపు పోగొట్టడానికేం పెద్దగా కష్టపడరు. ఏదొక డ్రామాలాడే.. శ్రీవల్లి కడుపు పోయిందని దొంగ ఏడుపులు ఏడ్చి.. ఆ నేరం నర్మద, ప్రేమలకు నెట్టేసినా నెట్టేయొచ్చు భాగ్యం, శ్రీవల్లిలు. అప్పుడు ఆ గొర్రెరామరాజు నర్మద, ప్రేమల్ని ద్వేషించొచ్చు. అప్పుడు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా శ్రీవల్లిదే పై చేయి అవుతుంది. కాబట్టి మనకెందుకో.. శ్రీవల్లి నెల తప్పడం వెనుక చందు కృషి కాదు.. భాగ్యం కుట్రనని కొడుతుందబ్బా.. చూద్దాం ఏమౌతుందో.