తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, ఎప్పట్నుంచంటే..?

Wait 5 sec.

తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచే సుర్రుమంటున్నాడు. నిప్పులు కొలిమిని తలపిస్తున్న ఎండలకు తోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శుక్రవారం పెద్దపల్లి జిల్లా అకెనపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 44.1 డిగ్రీల సెల్సియస్, కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టులో 43.8 డిగ్రీల సెల్సియస్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 43.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల స్థాయిలోనే నమోదవుతాయని, తీవ్రమైన వడగాలులు ఉంటాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. కనిష్ఠంగా రాత్రి ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలకు పెరుగుతాయని తెలిపారు. గాలిలో తేమ ఉదయం 30-50 శాతం, మధ్యాహ్నం 10-15 శాతం వరకు ఉంటుందని అన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వేడిమి ఉంటుందని అన్నారు. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరనుండగా... హైదరాబాద్‌లో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటాయన్నారు. ఇక ఏప్రిల్ 28 నుంచి కురుస్తాయని చెప్పారు. మొదట దక్షిణ, పశ్చిమ తెలంగాణలో ప్రారంభమై.. ఆ తర్వాత హైదరాబాద్ నగరంతో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయన్నారు. ఎండల తీవ్రత.. ఈ జాగ్రత్తలు తీసుకోండితీవ్రమైన ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అంటున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లని కాటన్ వస్త్రాలు ధరించాలని.., తలకు టోపీ లేదా గొడుగు వాడాలని సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. కళ్లు తిరగడం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ఉన్న చోటుకి చేరి ప్రాథమిక చికిత్స పొందాలని... ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎండల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.