ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈలోపే కొందరు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకాబోతున్నట్లు ప్రచారం మొదలు పెట్టారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. ఏకంగా శనివారం రోజు (ఏప్రిల్ 25న) ఫలితాలు విడుదలకాబోతున్నాయని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. దీంతో పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియాతో పాటుగా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి. ఏప్రిల్ 25న ఫలితాతు విడుదలవుతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సోషల్‌ మీడియాలో పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల చేస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు శ్రీనివాసులురెడ్డి. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఫలితాలు విడుదల చేసే తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అనధికారిక సమాచారం నమ్మొద్దని సూచించారు.. అలాగే టెన్త్ ఫలితాలపై తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీనివాసులురెడ్డి. విద్యాశాఖ చెబుతున్న సమాచారం ప్రకారం పదో తరగతి పరీక్షలకు సంబంధించి.. మూల్యాంకన ప్రక్రియ పూర్తిచేసి ప్రస్తుతం మార్కుల నమోదు, మరియు ఫలితాలకు సంబంధించిన ప్రాసెసింగ్ తుది దశలో ఉందని చెబుతుననారు. ఈలోపే ఫలితాలు విడుదల చేయబోతున్నట్లుగా తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. పదోతరగతి పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రకటనను విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి అధికారికంగా తెలియజేస్తారని చెబుతున్నారు. ఫలితాల విడుదలకు ముందు రోజు సమాచారం వస్తుందని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పదోతరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరు.. లేనిపక్షంలో మే మొదటివారంలో విడుదల చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరు ఏం చెప్పినా సరే అధికారులు ఫలితాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేసేవరకు ఆగాలని సూచిస్తున్నారు.