TGSRTC చర్చలు సఫలం.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ అంగీకారం, రోడ్డెక్కిన బస్సులు

Wait 5 sec.

తెలంగాణ సెక్రటేరియట్‌ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉప కమిటీతో టీజీఎస్‍ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ప్రజారవాణా వ్యవస్థను స్తంభింపజేసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించడంతో.. ఏప్రిల్ 22న ప్రారంభమైన నిరవధిక సమ్మెకు తెరపడింది. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హామీలు లభించడంతో జేఏసీ నాయకులు సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందంతో శనివారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపిన జేఏసీ నాయకులు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఒక్కో అంశంపై సమగ్రంగా డిప్యూటీ సీఎం, మంత్రులకు వివరించారు. 2021, 2025 వేతన సవరణలు చేయాలని జేఏసీ నాయకులు పట్టుబట్టారు. 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని కోరినట్లు తెలిసింది. కార్మికుల అన్ని డిమాండ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి నిర్ణయించినట్లు ఇవాళ అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. దీంతో పాటు కార్మిక సంఘాల అస్తిత్వానికి కీలకమైన గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో ఇవాళ ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మంత్రుల కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి.. ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో ఒక భాగమేనని, కార్మికుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కార్మికులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఖాళీల భర్తీ, ఇతర ఆర్థికపరమైన డిమాండ్లపై రాతతపూర్వక హామీ లభించడంతో కార్మికులు తమ నిరసనను విరమించినట్లు చెప్పారు. ఇక ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌కి నివాళి అర్పించారు. సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు, ఐకాస నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. కాగా, సమ్మె విరమణతో గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రయాణికులకు ఊరట లభించినట్లయింది.