తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్? ఈ నెలాఖరులో నియామక ఉత్తర్వులు

Wait 5 sec.

తెలంగాణకు కొత్త డీజీపీ రానున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, 1991 బ్యాచ్‌కు చెందిన నియమించేందుకు ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో.. కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ముగ్గురు అర్హులైన అధికారుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రానికి పంపింది.యూపీఎస్సీ పంపిన ఆ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ కావడం, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల నిర్వహణలో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆనంద్.. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు.శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా సీవీ ఆనంద్ డీజీపీ అవుతారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆనంద్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానాన్ని శిఖాగోయెల్‌కు అప్పగించారు. ఇది ఆయనను డీజీపీ పదవికి కేటాయించడానికేనని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు సీనియారిటీ, మరోవైపు ప్రభుత్వ నమ్మకాన్ని గెలుచుకున్న అధికారి కావడంతో సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ముగిసేలోగా.. అంటే ఈ నెలాఖరులోపు కొత్త డీజీపీ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన వెంటనే హోంశాఖ జీవో విడుదల చేయనుంది. ఇక తెలంగాణలో శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1994 బ్యాచ్‌కు చెందిన శిఖాగోయెల్‌ను హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆమె విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) డైరెక్టర్‌గానూ కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న 2004 బ్యాచ్‌ ఐపీఎస్‌ డా.తరుణ్‌జోషిని ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ఐజీపీగా ఉన్న 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ సుమతిని మల్కాజిగిరి కమిషనర్‌గా నియమించారు.