తెలంగాణలో ఆదాయ వనరుల పెంపుదల, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దూకుడు పెంచింది. మే మొదటి వారం నుంచి సవరించిన అమలులోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను 'ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం' ఆదేశించింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులతో పాటు పారిశ్రామిక ఎస్టేట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తూనే.. భూ విలువల సవరణ ద్వారా ఖజానాకు అదనపు ఆదాయాన్ని చేకూర్చడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ సమావేశంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి అనేక వినూత్న ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాలను చైనా తరహాలో అభివృద్ధి చేయాలని పారిశ్రామికవేత్తలు కోరగా.. ప్రభుత్వం దానికి సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) విధానాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి నగదు బదిలీలకు తావులేకుండా అమలు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పరిశ్రమల వల్ల కాలుష్యం ఉండకూడదని అదే సమయంలో అవి లాభసాటిగా నడవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.అయితే హిల్ట్ పాలసీపై రాజకీయంగా తలెత్తుతున్న కొన్ని విమర్శలను పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు కొట్టిపారేశారు. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ విధానం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కొందరు నేతలు భయపెట్టే ప్రయత్నం చేశారని కానీ పారదర్శకమైన ఈ విధానంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. భూ వినియోగ మార్పిడి ఛార్జీలను రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు నిర్ణయించారని అయితే వీటిని స్వల్పంగా తగ్గించాలని పారిశ్రామికవేత్తలు విజ్ఞప్తి చేశారు. రాయితీలు ఇవ్వకపోయినా సరే పరిశ్రమల స్థాపనకు తగినంత భూమిని కేటాయించాలని వారు కోరారు.మరోవైపు, రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో ఉన్న భూముల వివరాలను సమగ్రంగా సేకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న భూములు, ఆక్రమణకు గురైన ప్రాంతాలు, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న స్థలాల డేటాను సిద్ధం చేయాలని సూచించారు. అన్ డెవలప్డ్ ల్యాండ్ పాలసీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో పారిశ్రామిక రూపురేఖలను మార్చడమే కాకుండా.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది.