ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే తీపికబురు చెప్పనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి ఊరట కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి.. ముందుగా అర్హులైన వారికి వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 12కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది. ఆ రోజు నుంచి వితంతు పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.53 లక్షలమంది వితంతు పింఛన్‌లకు అర్హులు ఉంటారని అంచనాలు ఉన్నాయి. వీరందరికి కొత్తగా పింఛన్లు నెలకు రూ.4 చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 1.53 లక్షలమందికి పింఛన్ల కోసం నెలకు రూ.61 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ తీసుకునే భర్త చనిపోతే.. వారి స్థానంలో భార్యకు స్పౌజ్ కేటగిరిలో పింఛన్ ఇస్తోంది. ఈ ప్రక్రియ ప్రతి నెలా కొనసాగుతోంది.. కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే భార్య పేరు మీద ఆ తదుపరి నెల నుంచి రూ.4వేలు చొప్పున రుణం మంజూరు చేస్తోంది. ఇలా మొత్తం 2.30 లక్షలమందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. అయితే 60 ఏళ్లలోపు మగవారికి పింఛన్లు రావు.. ఒకవేళ భర్త చనిపోతే భార్య వితంతు కింద పింఛన్ మంజూరు చేస్తారు. అందుకే వీరందరికి ముందుగా వితంతు కేటగిరీలో కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.వితంతు కేటగిరిలో పింఛన్లు మంజూరు చేసిన తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దివ్యాంగుల కేటగిరిలో ఏకంగా లక్షమంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దివ్యాంగుల కోటాలో ప్రస్తుతం 6.50 లక్షలమంది పించన్లు తీసుకుంటున్నారు. వీరిలో ఓ లక్షమంది వరకు అనర్హులు ఉన్నారు.. ఈ లక్షమంది అనర్హుల్ని ఎలా నిరోధించాలని కసరత్తు జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటుగా ఆరోగ్య పింఛన్లతో కలిపి 28 కేటగిరీల్లో పంపిణీ చేస్తోంది. కొత్త పింఛన్ల కోసం దాదాపు 10 లక్షలమంది వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి పింఛన్లు ఇవ్వాలంటే నెలకు రూ.400 కోట్లు.. అదే ఏడాదికి అయితే రూ.4,800 కోట్లు ఖర్చవుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే కొత్త పింఛన్ల అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.. జూన్ నాటికి అర్హులకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.