బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్‌గా చంద్రబాబు.. ఆర్థిక మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు మరో ప్రతిష్టా్త్మక పురస్కారం అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును చంద్రబాబు అందుకున్నారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం చంద్రబాబు ఈ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మెరుగుపరిచి, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించినందుకు గానూ 2025 ఏడాదికి సంబంధించి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును చంద్రబాబు అందుకున్నారు. 2025 డిసెంబర్ నెలలో సునీల్ భారతి మిట్టల్, సజ్జన్ జిందాల్, ఉదయ్ కోటక్, డాక్టర్ దేవి శెట్టి, అభిషేక్ మను సింఘ్వీ, నోయల్ టాటాలతో కూడిన జ్యూరీ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేయగా.. శనివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును గతంలో అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), దేవేంద్ర ఫడ్నవిస్ (2019), అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) అందుకున్నారు. మరోవైపు ఎకనమిక్ టైమ్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు, పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకురావడంలో చంద్రబాబు పోషిస్తున్న పాత్రను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రశంసించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందన్న చంద్రబాబు.. 28న విశాఖలో గూగుల్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దేశంలో 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యం విధిస్తే, అందులో ఏపీనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుందని తెలిపారు. ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేసినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా అధ్యయనం చేసిన తర్వాతనే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలు అమలుచేశామన్న చంద్రబాబు.. విజన్‌ 2020 మూలంగానే హైదరాబాద్‌ ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అనుభవిస్తోందన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని దేశం ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు.