Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ దేశీయ మార్కెట్లు పడిపోవడం గమనార్హం. శాంతి చర్చల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడం మదుపరుల సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతుండడం, రూపాయి విలువ పడిపోవడం సహా గత మూడు వరుస సెషన్లలో వచ్చిన లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటివి మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లోకి జారుకునేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. దీంతో సెన్సెక్స్ 750కి పైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 24,400 స్థాయిని కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో ఇవాళ ఉదయం సెన్సెక్స్ సూచి 78,019 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. రోజు మొత్తం నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడే చూసుకుంటే 78,442 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 757 పాయింట్ల నష్టంతో 78,516 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 సూచీ 198 పాయింట్లు కోల్పోయి 24,378 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 37 పైసలు పడిపోయి 93.81 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీసీ ఈరోజు ఏకంగా 10 శాతం మేర నష్టపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, ఎటర్నల్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కొన్ని స్టాక్స్ లాభాలు అందుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 99 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర ఔన్సుకు 4754 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. ముంచేసిన ఐటీ స్టాక్స్ క్రితం రోజు క్యూ4 ఫలితాలను ప్రకటించిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఐటీ సెక్టార్ బలహీన భవిష్యత్తును సూచించడం ఇందుకు కారణమైనట్లు అంచనా వేయవచ్చు. దీంతో ఈరోజు హెచ్‌సీఎల్ టెక్ ఒక దశలో 11 శాతం వరకు పతనమైంది. ఇన్పోసిస్ షేరు 3.40 శాతం మేర పడిపోయింది. టీసీఎస్ షేరు ఈరోజు 2.76 శాతం నష్టపోగా టెక్ మహీంద్రా 2.55 శాతం, ఎంఅండ్ ఎం షేర్లు 3 శాతం మేర తగ్గాయి.