ఇంట్లో వరుస విషాదాలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2023లో అనారోగ్యంతో సాయన్న మృతి చెందారు. ఆ తర్వాత సాయన్న ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆ ఇంట్లో సాయన్న భార్య గీత ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో 3 ఏళ్ల వ్యవధిలోనే సాయన్న కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీరని లోటుగా మారింది. సాయన్న సతీమణి గీత బుధవారం రోజున కన్నుమూశారు. గత కొన్నేళ్లలో సాయన్న కుటుంబం వరుస మరణాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఒక విషాదం నుంచి కోలుకునే లోపే ఆ కుటుంబాన్ని మరో విషాదం వెంటాడుతోంది. 3 ఏళ్ల క్రితం సాయన్న అస్వస్థతకు గురై చనిపోగా.. ఆ తర్వాత ఏడాదిన్నర క్రితం ఆయన కుమార్తె లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా చనిపోయారు. తండ్రి మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లాస్య నందిత.. కారు ప్రమాదంలో చనిపోయారు.కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా సాయన్నకు మంచి పేరు ఉండేది. సాయన్న చేసిన సేవలు, అక్కడి ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా.. ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులను కూడా నియోజకవర్గ ప్రజలు బాగానే చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన సతీమణి మరణించడం పట్ల అనుచరులు, స్థానిక నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.2023 ఫిబ్రవరి 19వ తేదీన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న (72) అనారోగ్యంతో చనిపోయారు. కిడ్నీ సమస్యతో బాధపడిన ఆయనకు షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. సాయన్నకు ముగ్గురు కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, నమ్రత. ఇక ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సాయన్న కుమార్తె లాస్య నందిత గెలిచారు. అయితే 2024 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారు. ఇక ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన ఉప ఎన్నికలో లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వగా.. ఆమెపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మూడో స్థానానికి పరిమితమయ్యారు.