చమురు రవాణాకు అత్యంత కీలకమైనను ఇరాన్ దిగ్బంధించింది. దుబాయ్ నుంచి చమురు నింపుకుని గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ () స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల కిందట భారత్ నౌకపై ఐఆర్జీసీ సైన్యం కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. నౌక స్వాధీనానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, భారతీయ నౌకపై దాడికి న్యూఢిల్లీ తీవ్రంగానే స్పందించింది. భారత్‌లో ఇరాన్ రాయబారికి సమన్లు జారీచేసింది. ఈ అంశంపై ఇరాన్ స్పందిస్తూ.. తాము భారత నౌకలను లక్ష్యంగా చేసుకోలేదని, తమకు మద్దతు ఇవ్వని దేశాలను టార్గెట్ చేశామని వివరణ ఇచ్చింది.దీనికి ముందు,హర్మూజ్‌లో రెండు నౌకలపై దాడి చేసింది. వాటిని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అదుపులోకి తీసుకుని, ఇరాన్‌కు తరలిస్తున్నట్టు ఆ దేశ అధికారిక టెలివిజన్ నివేదించింది. వాటిని MSC ఫ్రాన్సెస్కా, ఎపామినోడ్స్‌ నౌకలుగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరగాల్సి ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు నిరవధికంగా పొడిగించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఇరాన్ ఈ చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘హర్మూజ్ జలసంధిలో శాంతిభద్రతలకు భంగం కలిగించడం ఇరాన్‌కు ఒక రెడ్ లైన్’ అని IRGC పేర్కొంది.హర్మూజ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన రెండు నౌకలపై కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నట్లు IRGC తెలిపింది. ఉదయం 7:55 గంటల ప్రాంతంలో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మొదటి కంటైనర్ నౌకపై దాడి చేసి, దానిని దెబ్బతీసిందని బ్రిటిష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కేంద్రం తెలిపింది. ఇరాన్ గన్‌బోట్ కాల్పులు ప్రారంభించే ముందు ఎటువంటి హెచ్చరికలు చేయలేదని యూకేఎమ్టీఓ తెలిపింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో బుధవారం అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన శాంతి చర్చలు వాయిదా పడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. పాక్ పర్యటనను చివరి గడియల్లో రద్దుచేసుకున్నారు. ఇక, ట్రంప్ సైతం ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.