AI దెబ్బకు ఉద్యోగాలు పోవడమే కాదు.. ఇళ్ల విక్రయాలూ పడిపోతున్నాయ్.. దేశంలో ఏం జరుగుతోందో ఆలోచించారా?

Wait 5 sec.

Real Estate: ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా చేరుతోంది. ఈ కృత్రిమ మేధ అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి చిన్న చిన్న కంపెనీల వరకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ రంగంపై ఈ ఏఐ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది తమ ఉపాధి కోల్పోతున్నారు. అలాగే ఏఐ కారణంగా ఐటీ నియామకాల్లో మందగమనం కొనసాగుతోంది. ఏఐ కారణంగా ఐటీలో లేఆఫ్స్‌ అవుతుండడం ఇండియాలో ఇళ్ల విక్రయాలపై ప్రభావం చూపిస్తోంది. ఉపాధి కోల్పోయో ప్రమాదం ఏర్పడడంతో ఇళ్లు కొనుగోలు చేసే వారు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.ఐటీ హబ్‌లుగా పేరుగాంచిన హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. ఏఐ ప్రభావం వయా ఐటీ రంగం నుంచి ఇళ్ల విక్రయాలపై పడుతోందని స్పష్టం చేసింది. భారత్‌లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గినట్లు తెలిపింది. 2026 మొదటి త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది. కొత్తగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల విక్రాయలు సైతం రెండు శాతం తగ్గి 94,855కు పరిమితమైనట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత పుంజుకున్న స్థిరాస్తి రంగం మళ్లీ ఇప్పుడు మందగమనాన్ని ఎదుర్కొంటోందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలోని గణాంకాల ద్వారా తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె మార్కెట్ మరీ బలహీనంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఐటీ ఉద్యోగాల్లో కోతలు, నియామకాల్లో అనిశ్చితి, ఆ ఆర్థిక భరాన్ని భరించగలమో లేదోనన్న ఆందోళన, అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక పరిణామాలు కొనుగోలుదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలను ఈ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా లెక్కలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ డైరెక్టర్ అంకితా సూద్ పేర్కొన్నారు. పరిమాణం పరంగా చూస్తే తక్కువే అయినప్పటికీ విలువ పరంగా మాత్రం ఇళ్ల విక్రయాల్లో పెరుగుదల ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ట్రాన్సాక్షన్ల విలువ ప్రతి ఏడాది 5 నుంచి 6 శాతం పెరుగుతోందని గుర్తు చేస్తున్నాయి. ఏఐతో ఉద్యోగాలు పోవడంతో స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియిన క్రమంలో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదని వెల్లడించింది.