మరోసారి ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) నుంచి వైదొలగాలన్న 2018 నాటి ఆయన నిర్ణయమే ట్రంప్‌కి ఇప్పుడు తలనొప్పిగా మారింది. గతంలో ఈ ఒప్పందం ఇరాన్ అణు కార్యకలాపాలను పరిమితుల్లో ఉంచింది. కానీ, తగినంత ప్రభావం లేదని, ఏకపక్షంగా ఉందనే కారణాలతో 2018లో ఇరాన్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైదొలగినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అమెరికా వైదొలగిన వెంటనే ఇరాన్ ఆ పరిమితులను దాటుతూ తన అణు కార్యకలాపాలను పెంచడం ప్రారంభించింది.2015లో బరాక్ ఒబామా హయాంలో అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం కుదిరింది. 2030 వరకు 15 ఏళ్లు పాటు అమల్లో ఉండేలా జరిగిన ఈ ఒప్పందం కారణంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను పరిమితం చేసుకుంది. ఇరాన్ తన వద్ద ఉన్న దాదాపు అన్ని అణు పదార్థాలను వదులుకోవడానికి అంగీకరించింది. తన వద్ద ఉన్న సుమారు 12.5 టన్నుల యురేనియం (దాదాపు 97 శాతాన్ని) రష్యాకు పంపింది.అయితే, ఒప్పందం కుదిరిన మూడేళ్ల తర్వాత తన జాతీయ భద్రతా సలహాదారుల సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ట్రంప్ ఏకపక్షం అని పేర్కొంటూ ఒప్పందం నుంచి వైదొలగారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇరాన్‌కు ఓ వరంలా మారింది. ఊహించిన దానికంటే చాలా ముందుగానే యురేనియం శుద్ధీకరణ వేగవంతం చేసి, నిల్వలను విస్తరించింది. దీంతో చాలా ముందుగానే టెహ్రాన్ అణుబాంబును తయారు చేయడానికి దగ్గరైంది.ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లతో సహా అమెరికా ప్రతినిధులు ఆ చర్యల పర్యవసానాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ట్రంప్ అణు చర్చలను రద్దు చేయడంతో రెండో దశ చర్చలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇరాన్ వద్ద ప్రస్తుతం 400 కిలోలపైగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. దీనిని భూగర్భ రహస్య కేంద్రంలో ఇరాన్ భద్రం చేసింది. మొత్తం మీద ఇరాన్ దగ్గర 11 టన్నుల యురేనియం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీనిని గనుక శుద్ధి చేస్తే ఏకంగా 100 అణు బాంబులను తయారు చేయడానికి సరిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గతంలో చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, దాని దగ్గర ఉన్న యురేనియం నిల్వలు చుట్టూనే జరిగేవి. కానీ, ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వంటివి కీలకంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌తో జరగబోయే ఒప్పందం 2015 కంటే మెరుగ్గా ఉంటుందని బాహటంగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. ఈ చర్చలలో అమెరికా రెండు ప్రధాన డిమాండ్లలో మొదటిది ఇరాన్ యురేనియం శుద్ధిని నిలిపివేయాలి.. రెండోది గత కొన్నేళ్లుగా సమీకరించిన అణు ఇంధన నిల్వలను అప్పగించాలి. కానీ, ఈ రెండు డిమాండ్లను ఇరాన్ తిరస్కరించింది.