వాహనదారులకు ముఖ్య గమనిక. వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విద్యుత్ జంక్షన్ సమీపంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ నుంచి వరంగల్ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపుగా వెళ్లే బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆగే బస్టాండును.. మరోచోటకు మార్చారు. నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ వద్దకు మార్చారు. ఈ బస్టాండ్ వద్దనే ఆదివారం నుంచి బస్సులు ఆగుతున్నాయి. మరోవైపు బోడుప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలు.. ఏషియన్ థియేటర్ వద్ద నుంచి భగాయత్ లే అవుట్ మీదుగా నాగోల్ చేరుకోవాలని అధికారులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ 81, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. బోడుప్పల్ నుంచి వచ్చే భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జ్ కింద యూటర్న్ తీసుకున్న అనంతరం.. ఉప్పల్ వైపు రావాలని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఇక సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపుగా వెళ్లే భారీ వాహనాలను కూడా దారి మళ్లించారు. ఈ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐఓసీ మీదుగా చెంగిచర్ల చేరుకోవాలని.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కు నుంచి, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక మీదుగా వరంగల్ రహదారికి వెళ్లాలని సూచించారు. మరోవైపు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్నారు. సుమారు 6.2 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారిడార్ పనులు పూర్తి కావటానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. ఈ నేపథ్యంలోనే పనులను వేగవంతం చేశారు.