తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఫలితాలు వెల్లడికి మరో 8 రోజుల సమయం ఉండటంతో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేల అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పోలింగ్‌కు ముందు సర్వేల్లో ప్రధాన పోటీ అధికార డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని, మూడో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని తేలింది. ఒక్కో స్థానంలో 15- 20వేల వరకు ఓట్లు దక్కుతాయని బలంగా నమ్ముతున్నారు. ఇవే ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తాయనే అంచనాలు ఉన్నాయి. పలుచోట్ల ఫలితాలను టీవీకే తారుమారు చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, గెలుపుపై విజయ్ ధీమాతో ఉన్నారని సమాచారం. రెండు రోజుల కిందట టీవీకే కార్యాలయంలో కీలక నేతలతో విజయ్ సమావేశమై పోలింగ్ సరళి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అనే తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. ఈ భేటీలో టీవీకే ఎన్నికల ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున్ సహా ముఖ్యనేతలు బుస్సి ఆనంద్, సెంగోట్టైయన్ పాల్గొన్నారు. పోలింగ్‌ శాతం, టీవీకేకు అనుకూలించే అంశాలు, సవాళ్లు గురించి వారిని విజయ్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకోవడంతోనే పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విజయ్‌.. టీవీకే విజయానికి ఇదే దోహదం చేస్తుందని ఆయన నమ్ముతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే అధికారంలో వస్తామనే ధీమాతో ఆయన క్యాబినెట్ ప్రాబబుల్స్‌ జాబితాను కూడా సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీవీకే పార్టీ నాయకులు ఇంకో అడుగు ముందుకేసి తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించినట్టు పోస్టర్లు వేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పెరంబూర్‌లో విజయ్‌‌కు 70వేలు, తిరుపోరూర్‌లో టీవీకే అభ్యర్థి విజయరాజ్‌కు 30వేలు భారీ మెజార్టీతో గెలిచినట్లు పోస్టర్లు వైరల్‌ చేస్తూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడం గమనార్హం. ఇక, ఒంటరిగా పోటీచేసిన టీవీకే.. మొత్తం 234 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. కానీ, ఎడప్పాడిలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో అక్కడ స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఊహాగానాలు నిజమవుతాయా? లేదా? అనేది మే 4న తేలిపోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో రికార్డుస్థాయిలో85 శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తడానికి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పోటీ చేయడం కారణమనే అభిప్రాయాలూ కూడా వ్యక్తం కావడం గమనార్హం.