ఈ మధ్యకాలంలో వేర్వేరుగా చూడలేని పరిస్థితి వస్తోంది. కామెడీ షోలో భాగంగా తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టాండప్ కమెడియన్ల షోలకు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు అడ్డుపడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల, అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఆ తరహా ఘటనే మరొకటి చోటుచేసుకుంది. టీడీపీ అధినేత నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్‌కు చెందిన కామెడీ షోకు అడ్డుపడ్డారు. ఓ షోలో భాగంగా రెండేళ్ల క్రితం చంద్రబాబు నాయుడుపై వేసిన జోకుల విషయంలో ఆగ్రహంతో ఉన్న టీడీపీ మద్దతుదారులు, బెంగళూరులో శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్నారు. ప్రదర్శన జరుగుతున్న సమయంలో వేదికపైకి చేరుకున్న టీడీపీ మద్దతుదారులు.. అసభ్యపదజాలంతో శరత్ ఉదయ్‌ను దూషించారు. ఈ విషయం మీద గతంలోనే తాను క్షమాపణలు చెప్పినట్లు శరత్ ఉదయ్ చెప్తున్నప్పటికీ.. ప్రేక్షకుల సమక్షంలో మరోసారి క్షమాపణ చెప్పాలంటూ బలవంతం చేశారు. బెంగళూరులోని కోరమంగళలో శనివారం రోజు రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం షోలో రికార్డైంది. కామెడీ షో ప్రారంభమైన కాసేపటికే వేదికపైకి చేరుకున్న టీడీపీ మద్దతుదారులు.. బలవంతంగా శరత్ ఉదయ్‌తో క్షమాపణలు చెప్పించారు. ప్రేక్షకుల నుంచి శరత్ ఉదయ్ వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి.. తొలుత తాను మీ అభిమానినంటూ పరిచయం చేసుకున్నాడు. మీరు బాగా కామెడీ చేస్తారని.. అయితే ఒక షోలో తమ నాయకుణ్ని అవమానించారని అన్నారు. ఆ వెంటనే, మరో ఇద్దరు వ్యక్తులు అతనితో చేరి, శరత్‌ ఉదయ్‌ను బెదిరించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారితో మరికొంతమంది చేరారు. తాను అప్పటికే క్షమాపణలు కోరినట్లు శరత్ ఉదయ్ చెప్తున్నప్పటికీ.. మరోసారి చంద్రబాబు, నారా లోకేష్‌కు ఆయనతో క్షమాపణలు చెప్పించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. మరోవైపు చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు గతంలో హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్ట్ జరగ్గా.. చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. అయితే చంద్రబాబుపై నక్సలైట్ల హత్యాయత్నం గురించి రెండేళ్ల కిందట శరత్ ఉదయ్ జోక్ చేసినట్లు టీడీపీ మద్దతుదారులు చెప్తున్నారు. అయితే దీనిపై అప్పట్లోనే తాను క్షమాపణలు చెప్పినట్లు శరత్ ఉదయ్ చెప్తున్నారు.