‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు.. ‘కర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా ప్రకటించిన బుచ్చిబాబు

Wait 5 sec.

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'పెద్ది'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేస్తారనే దాని గురించి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ని డైరెక్టర్ బుచ్చిబాబు అనౌన్స్ చేసేశారు.'పెద్ది' సినిమాని ముందుగా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. అయితే వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రశ్నార్థంగా మారింది. జూన్ లో విడుదల చేస్తారని రెండు మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని నిజం చేస్తూ జూన్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుచ్చిబాబు అనౌన్స్ చేశారు. ధనుష్ హీరోగా నటించిన 'కర' తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 'పెద్ది' ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతోందని, అంత బిజీలోనూ ధనుష్ ని చూడటానికి ఈవెంట్ కి వచ్చానని చెప్పారు. 'పెద్ది' సినిమా అప్డేట్ ఇవ్వమని ఆడిటోరియంలో అభిమానులు గోల చేయగా.. జూన్ 25న థియేటర్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. అయితే బుచ్చిబాబు ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే, అక్కినేని అభిమానులు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ వారు జూన్ 25వ తేదీని లాక్ చేశారు. కానీ ఇప్పుడు అదే డేట్ కి 'పెద్ది' చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అంతకముందు మే 1న 'లెనిన్' మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. 'పెద్ది' కోసం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ కోసం అఖిల్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. 'పెద్ది' సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్‌ కిలారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి.