Mali: నివాసంపై కారు బాంబు దాడి.. రక్షణ మంత్రి సహా ఫ్యామిలీ మృతి

Wait 5 sec.

ఆఫ్రికా దేశం మాలిలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాజధాని బమాకో, ఇతర నగరాల సమీపంలో జిహాదీ యోధులు, వేర్పాటువాద రెబల్స్‌, సైన్యం మధ్య రెండో రోజు కూడా భీకర పోరు కొనసాగింది. ఈ క్రమంలో రక్షణ మంత్రి ఇంటిపై ముష్కరులు కారు బాంబుతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రక్షణ మంత్రి, కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. సైనిక పాలకవర్గానికి బలమైన కోట అయిన కిటాలో రక్షణ మంత్రి సాడియో కామారా ఇంటిపై కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన రెండో భార్య, ఇద్దరు మనవరాళ్లు మరణించినట్టు కుటుంబ సభ్యులు, అధికార వర్గాలు తెలిపాయి.అజావాద్ లిబరేషన్ ఫ్రంట్ (FLA)కి చెందిన టువారెగ్ రెబల్స్, జిహాదీ గ్రూప్ (JNIM) సమన్వయంతో ఈ ఆకస్మిక దాడులను జరిపాయి. ఈ దాడుల్లో అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. ఐరోపా సమాఖ్య దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. మరోవైపు రాజధాని బమాకో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణేలో ఉందని సైనిక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం నాటి దాడుల్లోనూ దాదాపు 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ఇదిలా ఉండగా మాలి సైన్యానికి మద్దతు ఇస్తున్న రష్యా బలగాలు కిడాల్ నగరం నుంచి వైదొలగే ఒక ఒప్పందానికి అంగీకరించినట్టు టువారేగ్ రెబల్స్ ప్రకటించారు. ఆ నగరం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని వారు పేర్కొన్నారు. ‘‘ఒక సైనిక కాన్వాయ్ బయలుదేరడం మేము చూశాం... కానీ లోపల ఏం జరుగుతుందో వివరాలు తెలియవు... సాయుధులు ఇప్పుడు వీధులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు’’ అని ఒక స్థానికుడు తెలిపారు. టువారేగ్ కంచుకోట అయిన కిడాల్‌ను రష్యా వాగ్నర్ పారామిలిటరీ గ్రూప్ సాయంతో మాలి సైన్యం 2023 నవంబర్‌లో తిరిగి స్వాధీనం చేసుకుంది. దీంతో దశాబ్దానికి పైగా కొనసాగిన రెబల్స్ నియంత్రణకు తెరపడింది. మాలిలోని కిడాల్, గావో, సెవేరే వంటి ప్రాంతాల్లో సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. దశాబ్ద కాలంగా మాలి అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇక, 2020లో సైనిక తిరుగుబాటు తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.