ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏ వస్తువు కావాలన్నా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో బుక్ చేసుకుంటున్నారు. ఇక జెప్టో, బిగ్‌బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ కంపెనీలు 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకు డోర్ డెలివరీ చేస్తున్నాయి. ఇందుకోసం నిత్యం వేల మంది గిగ్ వర్కర్లు ఈ ఈ-కామర్స్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈ-కామర్స్ వస్తువుల డెలివరీకి డ్రోన్లు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్ నగరంలో వచ్చే ఏడాది నుంచి స్కై ఎయిర్‌ అనే సంస్థ డ్రోన్ల ద్వారా ఈ-కామర్స్ సేవలను అందించేందుకు చర్యలు చేపట్టనుంది.వచ్చే ఏడాది జులైలో హైదరాబాద్‌లో డ్రోన్‌ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు హైసియా వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో స్కై ఎయిర్ సంస్థ స్పష్టం చేసింది. తెలంగాణ సర్కార్‌తో కలిసి స్కై ఎయిర్‌ మెడిసిన్స్‌ ఫ్రం స్కై ప్రాజెక్ట్‌లో ఇప్పటికే ఈ స్కై ఎయిర్ సంస్థ భాగం కావడం గమనార్హం. గురుగ్రామ్, బెంగళూరు వంటి నగరాల్లో ఈ-కామర్స్‌ అల్ట్రా ఫాస్ట్‌ డ్రోన్‌ డెలివరీ సేవలను స్కై ఎయిర్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో నిత్యం 12 లక్షల డ్రోన్ డెలివరీలు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక హైదరాబాద్‌ నగరంలో రోజుకి 3.75 లక్షల డ్రోన్ డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. సాధారణంగా 30 కిలోమీటర్ల దూరం నుంచి ఏదైనా వస్తువును డెలివరీ చేయాలంటే.. ప్రస్తుతం వాహనాల ద్వారా ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో దాదాపు 2 గంటల సమయం పడుతుంది. కానీ ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో హైపర్‌ లోకల్‌ డ్రోన్‌ డెలివరీ నెట్‌వర్క్‌ ద్వారా స్కై ఎయిర్‌ సంస్థ కేవలం 7 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తుండటం విశేషం. ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి?గాలిలో డ్రోన్లు సేఫ్‌గా ఎగిరేందుకు వర్చువల్‌ స్కై టన్నెల్‌ ఏర్పాటు చేస్తారు. గోడౌన్ (వేర్‌హౌస్‌) నుంచి కస్టమర్ ఇంటి వరకు ఈ మార్గంలోనే ఆ డ్రోన్లు ప్రయాణిస్తాయి. ఆ రూట్‌లో ఇతర డ్రోన్‌లు ఉన్నాయా లేదా వాతావరణం ఎలా ఉందే చెక్ చేసేందుకు అన్‌మ్యాన్డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ కూడా ఉంటుంది. అందుకోసం భద్రతపరంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆయా ప్రాంతాల్లో బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. కస్టమర్ల నుంచి ఆర్డర్‌ రాగానే ఆ బేస్ స్టేషన్ల నుంచి డ్రోన్లు ఎగురుతాయి. భూమికి 120 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్లు ఎగురుతాయి. ఇక కస్టమర్ వద్దకు చేరుకున్న తర్వాత భూమి నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు దిగి.. ఆ వస్తవులను స్కైప్యాడ్‌ ప్రాంతంలో వదిలేస్తుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం 7 నిమిషాల్లో పూర్తి అవుతుందని స్కై ఎయిర్ సంస్థ తెలుపుతోంది. అక్కడి నుంచి ఆ వస్తువును డెలివరీ బాయ్‌ తీసుకుని.. చివరికి కస్టమర్‌కు అందిస్తారు. ఆ తర్వాత డ్రోన్‌ తిరిగి తన బేస్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక ఈ డ్రోన్లను ట్రాకింగ్‌ చేయడానికి, రియల్‌ టైమ్‌ నావిగేషన్‌ కోసం 5జీ మాడ్యుల్‌ అందుబాటులో ఉంటుంది. ఒక్కో డ్రోన్‌ గరిష్ఠంగా 10 కిలోల బరువు మోస్తుంది. సాధారణ డ్రోన్లను కంటికి కన్పించే దూరం వరకే ఆపరేట్‌ చేస్తారు. కానీ ఈ ఈ-కామర్స్ సేవలకు ఉపయోగించే డ్రోన్లు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అదే సమయంలో నగరంలో కంటికి కన్పించనంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పైలట్‌, ఆపరేటర్, రిమోట్‌ లేకుండానే కొన్ని డ్రోన్లు ఆటోమేటిక్‌గా ఎగురుతాయి. కానీ అవి సరిగ్గా వెళ్తున్నాయా లేదా అనేది సిస్టమ్ పర్యవేక్షిస్తుంది. దారిలో పక్షులు, డ్రోన్లు ఉంటే సెన్సర్లు గుర్తించి వాటి నుంచి తప్పిస్తాయి. డ్రోన్‌ ఎగురుతున్నంతసేపు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపిస్తూ ఉంటుంది. స్పీడ్, బ్యాటరీ, వాతావరణ పరిస్థితుల వంటి 255 రకాల సమాచారాన్ని డ్రోన్ బ్లాక్‌బాక్స్‌ రికార్డ్ చేస్తుంది. ఎమర్జెన్సీ సమయాల్లో డ్రోన్‌ సేఫ్‌గా ల్యాండ్‌ కావడానికి ఇన్‌బిల్ట్‌గా పారాచ్యూట్‌ ఉంటుంది.