కష్టకాలంలోనూ అదరగొట్టిన టెక్ మహీంద్రా.. 3 నెలల్లో రూ. 15 వేల కోట్ల ఆదాయం.. ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్!

Wait 5 sec.

: 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆఖరి త్రైమాసికానికి (జనవరి- మార్చి) సంబంధించి భారత ప్రముఖ ఐటీ కంపెనీలు వరుసగా ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. . ఆ తర్వాత విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా క్యూ4 ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు ఏప్రిల్ 22న (బుధవారం) టెక్ మహీంద్రా కూడా చివరి త్రైమాసికం ఫలితాలు వెల్లడించింది. సంస్థ నికర లాభం 3 నెలల కాలంలో రూ. 1354 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో చూస్తే లాభం వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగింది. సంస్థ కార్యకలాపాల ఆదాయం 13 శాతం పెరిగి 3 నెలల సమీక్షా త్రైమాసికంలో రూ. 15,076 కోట్లుగా వచ్చింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో చూస్తే ఆదాయం 5 శాతం పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ.. తమ షేర్ హోల్డర్లకు మరో గుడ్‌న్యూస్ కూడా చెప్పింది. 2026, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 36 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీంతో ఆర్థిక సంవత్సరంలో మధ్యంతర డివిడెండ్లతో కలిపి మొత్తం డివిడెండ్ రూ. 51 కి చేరింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అట్రిషన్ రేటు 12.1 శాతం వద్దే స్థిరంగా ఉంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,47,623 గా ఉంది. ఇక టెక్ మహీంద్రా స్టాక్ విషయానికి వస్తే.. ఫలితాలకు ముందు భారీగా పడిపోయింది. కిందటి రోజు రూ. రూ. 1500.80 వద్ద ముగిసిన స్టాక్ ధర.. ఇవాళ ఆరంభంలో 2 శాతానికిపైగా నష్టంతో మొదలైంది. ఇంకా ఇంట్రాడేలో భారీగా తగ్గి ఒక దశలో 6 శాతానికిపైగా పతనంతో రూ. 1404.10 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ ఫలితాల తర్వాత ఒక్కసారిగా భారీగా పుంజుకుంది. భారీ నష్టాల్ని ఆవిరి చేస్తూ 4 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఏప్రిల్ 22న మధ్యాహ్నం 2.50 గంటలకు చూస్తే దాదాపు 2 శాతం నష్టంతో రూ. 1470 స్థాయిలో ఉంది. సంస్థ మార్కెట్ విలువ రూ. 1.44 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1854 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 1304.10 గా ఉంది. కొత్త కొత్త ఐటీ టూల్స్ పుట్టుకొస్తున్న క్రమంలో కొంత కాలంగా ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.